సర్కారు కళాశాలల బలోపేతమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సర్కారు కళాశాలల బలోపేతమే లక్ష్యం

Jun 13 2026 7:14 AM | Updated on Jun 13 2026 7:14 AM

అన్ని కాలేజీల్లో మౌలిక వసతులు ఉత్తీర్ణత శాతం పెంచడంపై ఫోకస్‌ లెక్చరర్లు, విద్యార్థులకు ఫేషియల్‌ అటెండెన్స్‌ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఐఈవో జాదవ్‌ గణేశ్‌కుమార్‌

ఆదిలాబాద్‌టౌన్‌: ‘ప్రభుత్వ కళాశాలలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నాం.. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పాఠ్య పుస్తకాలు అందిస్తున్నాం.. త్వరలో మధ్యాహ్న భోజన పథకం, యూనిఫాం, నోట్‌బుక్స్‌ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.. తల్లిదండ్రులు కూడా అన్ని విషయాలు ఆలోచించి పిల్లల్ని ప్రభుత్వ కళాశాలల్లోనే చేర్పించాలి.. ’అని డీఐఈవో జాదవ్‌ గణేశ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.

సాక్షి: ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల పెంపుకోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?

డీఐఈవో: ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్ల పెంపు కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. అన్ని కళాశాలల లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు తమ పరిధిలోని గ్రామాలకు వెళ్లి అడ్మిషన్లు చేపడుతున్నారు. ఈనెల 30 వరకు గడువు ఉంది. 13 కళాశాలల్లో 1139 మంది విద్యార్థులు చేరారు.

సాక్షి: అన్ని కళాశాలల్లో మౌలిక వసతులు ఉన్నాయా.. వాటి ఏర్పాటు కోసం ఎలా ముందుకెళ్తున్నారు?

డీఐఈవో: ప్రతీ కళాశాలలో తాగునీరు, టాయిలెట్స్‌, ల్యాబ్‌, గ్రంథాలయం వంటి వసతులు ఉ న్నాయి. ఆరు కళాశాలకు మాత్రమే ప్రహారీలు లే దు. గతేడాది మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.50వేల నిధులు మంజూరు చేసింది. గోడల కు పెయింటింగ్‌ కూడా వేయించడం జరిగింది.

సాక్షి: లెక్చరర్ల కొరతను ఏవిధంగా అధిగమిస్తారు..?

డీఐఈవో: కళాశాలల్లో లెక్చరర్ల కొరత లేదు. 33 మంది గెస్ట్‌ లెక్చరర్లను కొనసాగిస్తున్నాం. అలాగే 8 మంది కాంట్రాక్ట్‌ లెక్చరర్లు, 168 మంది రెగ్యులర్‌ లెక్చరర్లు ఉన్నారు. నార్నూర్‌, తలమడుగు, బోథ్‌, తాంసి కళాశాలల్లో ఇన్‌చార్జి ప్రిన్సిపాళ్లు ఉండగా, మిగతా కళాశాలల్లో రెగ్యులర్‌ ప్రిన్సిపాళ్లు ఉన్నారు.

సాక్షి: వార్షిక ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఫలితాలపై ఎలా దృష్టి సారిస్తారు..?

డీఐఈవో: వార్షిక పరీక్షల ఫలితాలు తగ్గిన విషయం వాస్తవమే. సప్లిమెంటరీ ఫలితాలు ఫస్టియర్‌లో నాలుగో స్థానం, సెకండియర్‌లో ఐదో స్థానంలో నిలిచాం. కలెక్టర్‌ ప్రత్యేక చొరవ చూపారు. రెమీడియల్‌ తరగతులు నిర్వహించాం. ఈ ఏడాది ప్రారంభం నుంచే ప్రత్యేక దృష్టి సారిస్తాం.

సాక్షి: ప్రభుత్వ కళాశాలల్లో తరగతులు సక్రమంగా జరగవనే ఆరోపణలున్నాయి.. మీరేమంటారు?

డీఐఈవో: అలాంటిదేమి లేదు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు జరుగుతాయి. లెక్చరర్లు, విద్యార్థులకు ఫేషి యల్‌ అటెండెన్స్‌ ఉంది. విద్యార్థులు గైర్హాజరైతే తల్లిదండ్రులకు సమాచారం అందిస్తున్నాం. కళాశాలకు రాకపోతే ఇంటికి వెళ్లి విద్యార్థులను తీసుకొచ్చేలా చూస్తాం. తరగతి గదులతో పాటు కళాశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.

సాక్షి: నాణ్యమైన విద్యాబోధన కోసం ఎలాంటి చర్యలు చేపడతారు..?

డీఐఈవో: ప్రతీ కళాశాలకు ప్రభుత్వం ఈ ఏడాది డిజిటల్‌ బోర్డులను అందించింది. లెక్చరర్లకు 22 రోజుల పాటు ఓరియంటేషన్‌ నిర్వహిస్తాం. అన్ని వసతులతో పాటు నాణ్యమైన బోధన అందుబాటులో ఉన్న ప్రభుత్వ కళాశాలల్లోనే విద్యార్థులు చేరాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement