తొలకరితో ఊరించి ముఖం చాటేసిన వరణుడు ఇప్పటికే 20 శాతం విత్తిన పత్తి రెండు రోజుల్లో చినుకు పడకపోతే అంతే.. మిగతా వారిలో డైలమా
సాక్షి,ఆదిలాబాద్: జూన్ 1నుంచి వానాకాలం సీజన్ మొదలైంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివర కు వర్షాభావ పరిస్థితులున్నాయి. ఏడు మండలాలు మినహాయిస్తే మిగతాచోట్ల చినుకు జాడ కరువైంది. ఈనెల 8న తొలకరి పలకరింపుతో పలు మండలాల్లో కొందరు రైతులు పత్తి విత్తనాలు విత్తారు. మూడు రోజులుగా వాన లేకపోవడంతో వారంతా ఆందోళనలో ఉన్నారు. మరో రెండు రోజులు ఇలాగే ఉంటే ఆశలు వ దులుకోవాల్సిందే. జిల్లాలో 20 శాతానికి పైగా రైతులు ఇప్పటికే పత్తి విత్తనాలు వేశారు. మరో వైపు పగటి ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో మిగతా రైతులు వెనకడుగు వేస్తున్నారు. రెండు, మూడు వర్షాలు పడే వరకు వేచి చూడడమే మంచిదని భావిస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సైతం అదే సూచిస్తున్నారు.
తేలికపాటి వర్షాలున్నాయి..
ఈనెల 14 వరకు తేలికపాటి వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే జిల్లాలో ఎక్కడెక్కడ కురుస్తాయనేది స్పష్టత లేదు. పొడి దుక్కుల్లో విత్తనాలు వేయడం రిస్క్‌తో కూడుకున్నది. మంచి వర్షాలు కురిసిన తర్వాతే విత్తుకోవడం మంచిది.
– శ్రీధర్ చౌహాన్, ప్రధాన శాస్త్రవేత్త,
వ్యవసాయ పరిశోధన స్థానం, ఆదిలాబాద్
భీంపూర్ మండలం నిపాని గ్రామానికి చెందిన ముకుంద్ సంతోష్ తొలకరికి ముందే ఈనెల 5న తనకున్న 19 ఎకరాల్లో పత్తి విత్తనాలు విత్తాడు. మృగశిరకార్తే రోజు తొలకరితో సంబురపడ్డాడు. అయితే నాలుగు రోజులైనా వాన జాడ లేకపోవడంతో ఆందోళన మొదలైంది. ఒక సంతోష్ మాత్రమే కాదు.. జిల్లాలో విత్తనాలు వేసిన రైతులందరిదీ ఇదే పరిస్థితి.
జిల్లాలోని 21 మండలాల్లో
వర్షపాతం వివరాలు..
అధిక : తలమడుగు, సిరికొండ, సొనాల
సాధారణ : భీంపూర్, జైనథ్, మావల, తాంసి
వర్షాభావం : బేల, గుడిహత్నూర్, ఆదిలాబాద్‌అర్బన్, బోథ్, ఉట్నూర్,
సాత్నాల, భోరజ్
తీవ్ర వర్షాభావం : గాదిగూడ, నార్నూర్, ఆదిలాబాద్‌రూరల్, నేరడిగొండ, ఇచ్చోడ
అసలే వర్షం కురవని ప్రాంతాలు :
ఇంద్రవెల్లి, బజార్‌హత్నూర్


