సర్కారు బడికి కొత్త అ‘డ్రెస్‌’ | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడికి కొత్త అ‘డ్రెస్‌’

Jun 13 2026 7:14 AM | Updated on Jun 13 2026 7:14 AM

మారిన యూనిఫాం రంగులు ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ

నిర్మల్‌ఖిల్లా/నిర్మల్‌రూరల్‌/మంచిర్యాలఅర్బన్‌: ప్రభుత్వ, స్థానిక సంస్థల్లోని 1వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థుల అందరి యూనిఫాం మారింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే కొత్త యూనిఫాం అమలు చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ డాక్టర్‌ ఈ.నవీన్‌ నికోలస్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న యూనిఫాం రంగుల్లో మార్పులు చేస్తూ కొత్త డిజైన్లను ఖరారు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ యూనిఫాం విధానం అమలులోకి రానుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ, పంచాయతీరాజ్‌, గురుకుల, కేజీబీవీలు తదితర స్కూళ్లు విద్యార్థుల నూతన రంగుల దుస్తులతో శోభను సంతరించుకోనున్నాయి. పాఠశాలల వారీగా విద్యార్థుల కొలతలు, అవసరమైన గుడ్డ సరఫరా, కుట్టింపు ప్రక్రియలను త్వరలో ప్రారంభించనున్నట్లు సమాచారం. సమగ్ర శిక్ష, సెర్ప్‌, మెప్మా సంస్థల సమన్వయంతో యూనిఫాంల తయారీ, పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు.

ఇంకా చేరని ముడివస్త్రం

పాఠశాలలు ఈ నెల 15న పునః ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ విద్యార్థులకు రెండేసి యూనిఫామ్‌ జతలు అందిస్తారు. ఇప్పటివరకు జిల్లాలకు యూనిఫామ్‌ వస్త్రం చేరలేదు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ముడివస్త్రం చేరి అక్కడి నుంచి పాఠశాలలకు చేరాలంటే కనీసం నెలరోజులైన పట్టవచ్చు. దీంతో కొన్ని రోజుల వరకు గత సంవత్సరం యూనిఫాంతోనే విద్యార్థులు బడులకు రావాల్సి ఉంటుంది. నిర్మల్‌ జిల్లాలో గత సంవత్సరం 47,969 మంది విద్యార్థులకు యూనిఫామ్‌ను స్వయం సహాయక సంఘాల ద్వారా కుట్టించి అందజేశారు. ఈసారి బడిబాటలో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నందున సుమారు 53,100 మందికి అందించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మంచిర్యాల జిల్లాలో గత ఏడాది 761 పాఠశాలల్లో 42,711మంది విద్యార్థులకు మొదట 1,86,723 మీటర్ల ముడి వస్త్రం సరఫరా చేశారు. రెండో దఫా 58,059 మీటర్ల వస్త్రం సరఫరా అయింది. గత ఏడాది వేసవి సెలవులకు ముందే యూనిఫామ్‌కు అవసరమైన వస్త్రం సరఫరా చేసి సకాలంలో విద్యార్థులకు యూనిఫామ్‌లు పంపిణీ చేశారు. ఈ ఏడాది వేసవి సెలవులు ముగిసిపోతున్నా ముడివస్త్రం సరఫరాకు నోచుకోలేదు. కొత్తగా పాఠశాలల్లో అడ్మిషన్లు పొందే విద్యార్థులకు మరింత ఆలస్యమయ్యే అవకాశం లేకపోలేదు.

ప్రత్యేకతలివే..

విద్యాశాఖ విడుదల చేసిన నమూనాల ప్రకారం బాలురకు లైట్‌ బ్లూ రంగు షర్ట్‌, నేవీ బ్లూ రంగు ప్యాంట్‌/నిక్కర్‌ ఉండనుంది. బాలికలకు లైట్‌ బ్లూ టాప్‌తోపాటు నేవీ బ్లూ స్కర్ట్‌ లేదా దుస్తులు అమలు చేయనున్నారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బాలికల యూనిఫాంలో ప్రత్యేక నేవీ బ్లూ వేస్ట్‌కోట్‌ను కూడా ప్రవేశపెట్టారు. తరగతుల వారీగా డిజైన్లలో స్వల్ప మార్పులు ఉండనున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement