ఖానాపూర్: వైద్యసిబ్బంది నిర్లక్ష్యమే ఒకరు మృతిచెందారని ఆరోపిస్తూ ఖానాపూర్ ప్రభుత్వ ఆ సుపత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం ఆందోళనకు దిగా రు. రోగిని పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంధువులు, గ్రామస్తులతో కలిసి అధికారులు, వైద్యసిబ్బందిని నిలదీశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని సుర్జాపూర్ గ్రామానికి చెందిన షేక్ షారుఖ్ తన తండ్రి షేక్ హుస్సేన్ (54)కు గురువారం అర్ధరాత్రి తీవ్రనొప్పులు, అధిక చెమటలు వచ్చాయి. ఆర్‌ఎంపీ సూచన మేరకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. విధుల్లో ఉన్న సిబ్బంది కేవలం ఒక ఇంజక్షన్, మూడు మాత్రలు ఇచ్చారని, కనీసం బీపీ పరీక్ష నిర్వహించలేదు. వైద్యుడు ప్రత్యక్షంగా వచ్చి చూడలేదు. ఆసుపత్రిలో అడ్మిట్ కావాలని చెప్పకపోవడంతో దా దాపు 40 నిమిషాల పాటు అక్కడే ఉండి తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం హు స్సేన్ ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విధుల్లో నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, రాత్రివేళ వైద్యుడు అందుబాటులో లేరని కుటుంబీకులు ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబం చేసిన ఆరోపణలను ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ స్వర్ణరెడ్డి ఖండించారు. రోగికి వైద్యచికిత్స అందించామని, డ్యూటీ వైద్యుడు అందుబాటులో ఉన్నారని, సిబ్బంది రోగి పరిస్థితి వైద్యుడి దృష్టికి తీసుకెళ్లలేదని తెలిపారు. సిబ్బంది అనుమతి లేకుండానే రోగిని ఇంటికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. సుర్జాపూర్ సర్పంచ్ బక్కశెట్టి వెంకట్‌రాములు, నాయకులు భూసి నరేందర్, బొమ్మెన రాకేశ్, ముషారఫ్ తదితరులు పాల్గొన్నారు.


