రుణాల మంజూరు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

రుణాల మంజూరు వేగవంతం చేయాలి

Jun 11 2026 8:05 AM | Updated on Jun 11 2026 8:05 AM

● ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకుల పాత్ర కీలకం ● కలెక్టర్‌ రాజర్షి షా

కై లాస్‌నగర్‌: ప్రభుత్వ సంక్షేమ, అభివవృద్ధి పథకాల అమలులో బ్యాంకుల పాత్ర కీలకమని, లక్ష్యం మేరకు రుణాల మంజూరు వేగవంతం చేయాలని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన డీఎల్‌ఆర్సీ డీసీసీ సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని బ్యాంకు అధికారులతో కలిసి ఆవిష్కరించారు. పీఎంఎఫ్‌ఎంఈ, పీఎంఈజీపీ, ఎన్‌ఎల్‌ఎం, పీఎం విశ్వకర్మ వంటి ప్రతిష్టాత్మక పథకాల పురోగతిపై సుదీర్ఘంగా సమీక్షించారు. వివిధ పథకాల కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు సత్వరమే పరిష్కరించి రుణాల మంజూరు వేగవంతం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాలు కేవలం సంప్రదాయ వ్యాపారాలకే పరిమితం కాకుండా, సరికొత్త ఇన్నోవేటివ్‌ ఐడియాలతో ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని సూచించారు. మహిళలను స్వయం ఉపాధి దిశగా నడిపించేందుకు బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రుణాల కోసం వచ్చే రైతులను ఇబ్బంది పెట్టకుండా నిబంధనల ప్రకారం మంజూరు చేయాలన్నారు. ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా డ్రోన్ల వినియోగం, రూఫ్‌ టాప్‌ సోలార్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపన కోసం కొత్త తరహా రుణాలు అందించాలని పిలుపునిచ్చారు. అలాగే అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు పొందిన రైతులకు కూడా లోన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకు ముందు లీడ్‌ డిస్టిక్ర్ట్‌ మేనేజర్‌ ఉత్పల్‌ కుమార్‌ ధామ్‌ జిల్లా ఆర్థిక ప్రగతిని వివరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, ఆర్‌బీఐ ఏజీఎం రాములు, నాబార్డ్‌ డీడీఎం అబ్దుల్‌ రావూఫ్‌, ఆర్‌సేటీ డైరెక్టర్‌ మహ్మద్‌ గౌస్‌, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement