గుడిహత్నూర్: తోషంలో నిర్వహించిన గ్రామసభలో డీజీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ, గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యు వత గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హైల్మెట్, సీట్ బెల్టు ధరించడంతో పాటు మద్యం సేవించకుండా వాహనాలు నడపాలన్నారు. అనంతరం 30 మంది ఆటో డ్రైవర్లకు ప్రమాద సమయంలో ఉపయోగపడే ఫస్టయిడ్ కిట్లు పంపిణీ చేశారు. యువతకు ఐదు వాలీబాల్ కిట్లు, 200 మందికి హెల్మెట్లు అందజేశారు. అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. 75 మంది యువతకు లర్నింగ్ లైసెన్స్ అందజేశారు. గతంలో లొంగిపోయిన ముగ్గురు మావోయిస్టులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషాతో పాటు పోలీసు అధికారులు పాల్గొన్నారు.


