ఆదిలాబాద్: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రైల్వే పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీ గోడం నగేష్ దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవకు విన్నవించారు. సికింద్రాబాద్‌లోని ఆయన కార్యాలయంలో మంగళవారం కలిసి పలు పెండింగ్ అంశాలపై చర్చించారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన ‘ఆదిలాబాద్–ఆర్మూర్’ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ వేగవంతం చేయాలని కోరారు. కరంజి రోడ్–జందాపూర్ (ఎల్‌సీ నంబర్ 33), బాసర రైల్వే స్టేషన్ (ఎల్‌సీ నంబర్ 182), రెబ్బెన (ఎల్‌సీ నంబర్ 71) వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణానికి తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని విన్నవించారు.


