సంఖ్య
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందించే యూనిఫాం జాడ లేదు. మరో ఐదు రోజుల్లో బడులు పునఃప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు వస్త్రం చేరుకోలేదు. అయితే కుట్టిన యూనిఫాం అందజేస్తారా.. లేక వస్త్రం పంపిస్తారా అనే విషయం విద్యాశాఖ అధికారులకు సైతం తెలియడం లేదు. ప్రతిసారి మార్చి, ఏప్రిల్‌లోనే వస్త్రం వచ్చేది. అయినా బడి రీఓపెన్ అయ్యే సమయానికి ఒక జత కూడా పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేని పరిస్థితి. ఈసారి వస్త్రమే రాలేదు. ఇక కుట్టడం ఎప్పుడని ఉపాధ్యాయుల్లో సందేహం వ్యక్తమవుతుంది. కాగా, పాఠశాల విద్యా శాఖాధికారులు మాత్రం మొదటి రోజు యూనిఫాం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
చిరిగిన దుస్తులతోనే..
ఈ విద్యా సంవత్సరం జూన్ 15న బడులు పునఃప్రారంభం కానున్నాయి. ఏటా కనీసం 50 శాతం మంది విద్యార్థులకై నా మొదటి రోజు పాఠ్య పుస్తకాలతో పాటు ఒక జత యూనిఫాం అందజేసేవారు. అయితే ఈసారి ఆ పరిస్థితి కానరావడం లేదు. చిరిగిన దుస్తులతోనే బడికి వచ్చే పరిస్థితి నెలకొందని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. రెడీమేడ్ దుస్తులు పంపిణీ చేస్తే విద్యార్థులకు వదులుగా, చిన్నవి, పెద్దవిగా సైజులు సరిపోక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా యూనిఫాం కుట్టిస్తుండడంతో సమస్య ఎదురయ్యేది కాదు. రెండేళ్లుగా స్వయం సహాయక సంఘాల ద్వారా కుట్టించి విద్యార్థులకు పంపిణీ చేసేవారు. సకాలంలో కూలీ అందకపోయినా యూనిఫాంలను మాత్రం కుట్టి పాఠశాలలకు అందజేసేవారు. మరి ఈసారి పరిస్థితి ఏమిటనేది తెలియరావడం లేదు.
73,884 మంది విద్యార్థులకు..
జిల్లాలో 1180 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వీటిలో 73,884 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరందరికీ రెండు జతల యూనిఫాం అందించాల్సి ఉంది. రెండేళ్లుగా స్వయం సహాయక సంఘాల ద్వారా యూనిఫాం కుట్టించి విద్యార్థులకు పంపిణీ చేసేవారు. ఈ కుట్టుకు సంబంధించిన బాధ్యతలను డీఆర్‌డీఏకు అప్పగించేవారు. యూనిఫాంలు త్వరగా కుట్టించేలా ప్రభుత్వం మండల, జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసేవారు. ఈసారి ఆ కమిటీలు కూడా వేయలేదని తెలుస్తోంది. అయితే గతనెల 27న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నికోలస్ యూనిఫాంకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. డేస్కాలర్ విద్యార్థులకు రెండు జతల యూనిఫాం, బ్లాక్ షూ, రెండు సాక్సులు, బెల్టు అందిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే రెసిడెన్షియల్, కేజీబీవీ, మోడల్ స్కూల్, హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు నైట్ డ్రెస్, పీటీ డ్రెస్, ట్రాక్‌సూట్, వైట్ షూ, రెండు సాక్సులు, టవల్, ప్లేట్, గ్లాస్, కటోరా, కప్పులు, స్పూన్స్ ఇవ్వాలని పేర్కొన్నారు. వీటన్నింటిని బడులు తెరిచిన మొదటిరోజు అందించేలా చర్యలు చేపట్టాలని తెలిపినప్పటికీ ఇంకా బడులకు చేరుకోలేదు.
యాజమాన్యం పాఠశాలలు విద్యార్థుల
డీఈవో పరిధిలో 974 52,485
ట్రైబల్ వెల్ఫేర్ 171 14,054
బీసీ గురుకులాలు 06 331
ఎస్సీ గురుకులాలు 16 1975
గిరిజన గురుకులాలు 06 1755
జ్యోతిబాపూలే
పాఠశాలలు 07 3284
యూనిఫాం అందించేలా చర్యలు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫాం అందించేలా చర్యలు చేపడుతున్నాం. బడులు తెరిచిన మొదటి రోజు అందించాలని విద్యాశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు వస్త్రం రాలేదు.
– ఉష్కం తిరుపతి, సెక్టోరియల్ అధికారి


