ఆదిలాబాద్‌రూరల్: బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమంలో పోరాడిన తొలి ఆదివాసీ పోరాటయోధుడు బిర్సాముండా అని కొలాం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొడప సోనేరావ్ అన్నారు. బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ ఎదుట గల ఆయన విగ్రహానికి మంగళవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిర్సాముండా స్ఫూర్తితో ఆదివాసీలకు దక్కాల్సిన హక్కులు, చట్టాల సాధనకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజ్‌గోండ్ సేవా సమితి రాష్ట్ర నాయకుడు కుర్సెంగే తానాజీ, మెస్రం శంకర్, ఆదివాసీ పర్దాన్ సమాజ్ జాతీయ నాయకుడు కుర్సెంగే యాదవ్ రావ్, గేడం మాధవ్, గేడం మనోహర్, మేస్రం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


