ఆదిలాబాద్‌టౌన్: సెల్‌ఫోన్ పోయినా, చోరీకి గురైన వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. రూ.66లక్షల విలువైన 330 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి గురువారం స్థానిక పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో పోగొట్టుకున్న బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో మొబైల్ ఫోన్ల రికవరీకి ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు తెలిపారు. ఏడాదిలో 1,500 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు చెప్పారు. ఇది జిల్లా చరిత్రలోనే అత్యధిక రికవరీగా నిలిచిందని పేర్కొన్నారు. రైతుబజార్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రిమ్స్ ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో మొబైల్ చోరీలు అధికంగా జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, ప్రత్యేక రికవరీ బృందం సభ్యులు ఆర్‌ఎస్సై పి.గోపీకృష్ణ, రియాస్, మజీద్, త్రిశూల్, అన్వేశ్, నవనీత్ తదితరులున్నారు.
రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు
రుణాలు, సబ్సిడీలు, వ్యవసాయ పరికరాలు, పంటల కొనుగోలు పేరుతో రైతులను మోసగించేవారిపై కఠినచర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో రైతుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు గతేడాది రైతులను మోసం చేసిన వ్యక్తులపై 25 కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో నెల వ్యవధిలోనే 20 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. రైతులు అప్రమత్తమై మోసాలకు గురి కాకుండా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, మోసాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
అక్రమ మద్యం తయారీపై ఉక్కుపాదం
జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గుడుంబా నిర్మూలన డ్రైవ్ చేపట్టామని, అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. జిల్లాలోని 11 పోలీస్‌స్టేషన్ల పరిధిలో 35 ప్రత్యేక బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 32.5 లీటర్ల గుడుంబా, 35 లీటర్ల బెల్లం వాష్‌తో పాటు రెండు క్యాన్లు, 705 లీటర్ల కల్లు, తయారీ సామగ్రి స్వాధీనం చేసుకుని 26 మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఉట్నూర్‌లో మూడు కేసులు నమోదు చేసి ఆరు లీటర్ల గుడుంబా, 15 లీటర్ల బెల్లం వాష్, నార్నూర్‌లో ఏడుగురిపై కేసులు నమోదు చేసి 13 లీటర్ల గుడుంబా, రెండు క్యాన్ల బెల్లం వాష్, ఆదిలాబాద్‌రూరల్‌లో ఆరుగురిపై కేసులు నమోదు చేసి నాలుగు లీటర్ల గుడుంబా, 10 ప్యాకెట్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నుట్ల తెలిపారు. తలమడుగులో రెండు కేసులు నమోదు చేసి కల్తీ కల్లు నమూనాలు సేకరించినట్లు పేర్కొన్నారు. బేలలో ఇద్దరిపై కేసులు నమోదు చేసి రెండు లీటర్ల గుడుంబా, గుడిహత్నూర్‌లో ఒక కేసు నమోదు చేసి ఐదు లీటర్ల కల్తీ కల్లు పట్టుకున్నట్లు చెప్పారు. ఇచ్చోడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి నలుగురిని బైండోవర్ చేయడంతో పాటు 2.5 లీటర్ల గుడుంబా, 500 లీటర్ల కల్లు, కల్లు తయారీ సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నేరడిగొండలో ఐదుగురిపై కేసులు నమోదు చేసి ఐదు లీటర్ల గుడుంబా, 20 లీటర్ల బెల్లం వాష్, 200 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.


