సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్రంలో భూముల విలువలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూములు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల కొత్త మార్కెట్ విలువలను ఖరారు చేసింది. జిల్లాలో 15నుంచి 50 శాతం వరకు భూముల మార్కెట్ విలువ సవరణ చోటు చేసుకుంది. శుక్రవారం నుంచి కొత్త ధరలు వర్తింపజేస్తున్నారు. ఇదివరకు స్టాంప్ డ్యూటీ ఉండనుండగా, సవరించిన విలువల ఆధారంగా వినియోగదారులపై భారం పడనుంది. పలుచోట్ల 50నుంచి 100శాతం వరకు పెంచనున్నట్లు ప్రభుత్వం పేర్కొనగా, జిల్లాలో మాత్రం 15 నుంచి 50 శాతం వరకు భూముల విలువలను సవరించి పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఆదిలాబాద్ అర్బన్ మండలం మినహాయిస్తే 20 మండలాలున్నాయి. ఆదిలాబాద్ పట్టణ పరిధిలో పలుచోట్ల ప్లాట్ల విలువలు 50శాతం వరకు పెంచారు. స్లమ్ ఏరియాల్లోని ప్లాట్లకు మాత్రం 15–25 శాతం వరకు సవరించారు. ధరలు పెరగనుండగా, గురువారం ప్లాట్ల రిజిస్ట్రేషన్ల తాకిడి పెరిగింది. ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సాధారణంగా రోజుకు 30 ప్లాట్ల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా చివరిరోజు సుమారు 50 ప్లాట్ల వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి.
మండలాల పరిధిలో..
మండలాల పరిధిలో వ్యవసాయ భూముల ధరలు కూడా 15 నుంచి 50 శాతం వరకు పెంచారు. అధికారికంగా శుక్రవారం నుంచి వీటిని అమలు చేస్తున్నారు. రహదారి సౌకర్యం, నివాస ప్రాంతాలకు సమీపంలోని వ్యవసాయ భూములకు ధరలు పెంచారు. జిల్లాలో ఇదివరకు ఎకరానికి రూ.2.50 లక్షల వరకు ఉండగా రూ.3లక్షల నుంచి రూ.3.75 లక్షల వరకు పెంచారు. కొన్నిచోట్ల రూ.5లక్షల వరకూ పెంచేశారు. నేరడిగొండ మండలంలో రహదారికి సమీపంలోని వ్యవసాయ భూముల ధరలు ఇదివరకు బయట మార్కెట్ విలువలకు దరిదాపున ఉండగా, వాటిని సవరించి తగ్గించినట్లు తెలుస్తోంది.
ముగిసిన కసరత్తు
భూముల విలువల సవరణకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులు కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో మార్కెట్ విలువలను అంచనా వేస్తూ అక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తూ తాజాగా సవరణ చేశారు. రిజిస్ట్రేషన్ల సంఖ్య నామమాత్రంగా ఉన్నచోట పాత ధరలనే ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


