అంగన్‌వాడీ కేంద్రాల్లో బ్రేక్‌ఫాస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రాల్లో బ్రేక్‌ఫాస్ట్‌

Jun 5 2026 4:05 AM | Updated on Jun 5 2026 4:05 AM

● పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద జిల్లా ఎంపిక ● అమలు కోసం ఐసీడీఎస్‌ కసరత్తు ● 48వేల మంది చిన్నారులకు లబ్ధి ● పోషకాహార లోపం నియంత్రణకే..

ఆదిలాబాద్‌టౌన్‌: అంగన్‌వాడీ కేంద్రాల్లో బ్రేక్‌ఫాస్ట్‌ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వేసవి సెలవుల తర్వాత కేంద్రాలు పునఃప్రారంభించిన రోజే అమలు చేసేలా ఐసీడీఎస్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ పథకం అమలు ద్వారా చిన్నారుల్లో పోషకాహార లోపం తలెత్తదు. కేంద్రాల్లో చిన్నారుల హాజరు పెరిగే అవకాశముంది. మూడు రోజుల పాటు ఉప్మా, మరో మూడు రోజుల పాటు కిచిడీ అందిస్తారు. ఇందులో గోధుమ రవ్వ, మినుములు, శనగలు, పల్లీలు, టమాటా, క్యారెట్‌ వినియోగిస్తారు. ఇందులో 100 గ్రాముల న్యూట్రిషియన్‌, 15.5 గ్రాముల ప్రొటీన్‌, 465 ఎనర్జీ క్యాలరీలు అందేలా చూస్తారు. దీంతో చిన్నారుల్లో పోషక విలువలు పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.

పోషకాహార లోపానికి చెక్‌

అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడేళ్లలోపు చిన్నారులకు బాలామృతం, ఇంటికే కోడిగుడ్లు అందజేస్తారు. కేంద్రాల్లో చదువుకునే ఆరేళ్ల లోపు పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. కేంద్రాలకు వచ్చే చిన్నారుల్లో పేదింటి పిల్లలే ఎక్కువ ఉండడంతో ఉదయం ఇంటి వద్ద ఏమీ తినకుండానే వస్తారు. మధ్యాహ్న భోజనం పెట్టే వరకు నీరసించి పోతున్నారు. దీన్ని నివారించేందుకే ప్రభుత్వం ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేసి బ్రేక్‌ఫాస్ట్‌ పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. జిల్లాలో పోషకాహార లోపంతో బాధపడేవారిలో ఏడాది నుంచి ఆరేళ్ల లోపువారు అధికంగా ఉన్నారు. ఇందులో ఏజెన్సీ ప్రాంతం వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అంగన్‌వాడీ టీచర్లు పోషకాహార లోపం ఉన్నవారిని జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లోగల న్యూట్రిషియన్‌ (ఎన్‌ఆర్‌సీ) సెంటర్‌లో చేర్చుతున్నారు. అయితే, చాలామంది తల్లిదండ్రులు పిల్లలను న్యూట్రిషియన్‌ సెంటర్‌లో చేర్పించేందుకు ఆసక్తి చూపడంలేదు.

జిల్లాలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌లు 5

అంగన్‌వాడీ కేంద్రాలు 1,288

కేంద్రాలకు వచ్చే చిన్నారులు 48,368

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement