ఆదిలాబాద్‌రూరల్: దేశంలో కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలకు ఎక్కడైతే అధిక ఓటు శాతం వస్తుందో అక్కడ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్‌ను అడ్డు పెట్టుకుని సర్ ప్రక్రియతో ఓట్లను తొలగిస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. మావల మండల కేందరలోని చిల్కూరి లక్ష్మీ గార్డెన్‌లో డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ఎన్నికల్లో విపక్షాలకు ఏ బూత్‌లలో ఎక్కువ ఓట్లు వచ్చాయో గుర్తించి వాటిని తొలగించే ప్రయత్నం బీజేపీ సర్కారు చేస్తోందని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పెట్రో ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గ అబ్జర్వర్లు రమేశ్ బాబు, కొత్వాల్, ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల ఇన్‌చార్జీలు కంది శ్రీనివాస రెడ్డి, ఆడే గజేందర్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపురావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, సాజిద్‌ఖాన్, గండ్రత్ సుజాత, సంజీవ్ రెడ్డి, బోజారెడ్డి, గిమ్మ సంతోష్ తదితరులున్నారు.


