విద్యాశాఖ గాడిలో పడేనా? | - | Sakshi
Sakshi News home page

విద్యాశాఖ గాడిలో పడేనా?

Jun 1 2026 4:07 AM | Updated on Jun 1 2026 4:07 AM

● ఇన్‌చార్జి డీఈవోగా మాధవి ● ఆరేళ్లుగా రెగ్యులర్‌ అధికారి కరువు ● పాలనపై మార్కు చూపేనా..

● ఇన్‌చార్జి డీఈవోగా మాధవి ● ఆరేళ్లుగా రెగ్యులర్‌ అధికారి కరువు ● పాలనపై మార్కు చూపేనా..

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లా విద్యాశాఖకు రెగ్యులర్‌ అధికారి లేకపోవడంతో నిర్వహణ గాడితప్పింది. ఆరేళ్లుగా ఇన్‌చార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. ఈక్రమంలో కొంతమంది గురువులు, ఉద్యోగుల పనితీరు ఇష్టారాజ్యంగా సాగుతుందనే విమర్శలున్నాయి. ఫలితంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కరువై విద్యార్థుల చదువులు కుంటుపడుతున్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఎఫ్‌ఏసీ డీఈవోగా మాధవిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం ఆమె విధుల్లో చేరే అవకాశముంది. కరీంనగర్‌ విద్యాశాఖ కార్యాలయంలో ఏడీగా పనిచేస్తూ సాధారణ బదిలీల్లో నిజామబాద్‌ జిల్లాకు బదిలీ అయ్యారు. అలాగే ఆదిలాబాద్‌కు డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఆమె గతంలో పెద్దపల్లి ఎఫ్‌ఏసీ డీఈవోగా పనిచేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తించారు. జిల్లాలో విద్యాశాఖపై పూర్తి పట్టు ఉండటంతో గాడిన పెట్టే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఆరేళ్లుగా ఇన్‌చార్జీలే దిక్కు..

2019 సంవత్సరంలో రెగ్యులర్‌ డీఈవోగా పనిచేసిన జనార్దన్‌ రావు కార్యాలయ ఉద్యోగులతో పా టు ఉపాధ్యాయ సంఘాలతో పొసగకపోవడంతో ఆయనను అప్పటి జిల్లా కలెక్టర్‌ ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. ఆ త ర్వాత ఇన్‌చార్జి బాధ్యతలను డై ట్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన ర వీందర్‌ రెడ్డికి అప్పగించగా ఆ యన మూడేళ్ల పాటు కొనసాగారు. నిర్మల్‌కు బదిలీపై వెళ్లడంతో అక్కడ ఏడీ, డీఈవోగా పనిచేసిన ప్రణీతను జిల్లాకు బదిలీ చేశారు. ఆమె 2025 మార్చి 31 వరకు పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. దీంతో వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డికి అదనపు బాద్యతలు అప్పగించారు. ఆయన పనితీరు సరిగా లేకపోవడంతో ఆగస్టులో ఐటీడీఏ పీవో, స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌గా పనిచేసిన ఖుష్పు గుప్తా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహించారు. ఆమె సెలవుపై వెళ్లడంతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న రాజేశ్వర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆయన స్థానంలో మాధవిని నియమించారు.

పర్యవేక్షణ లేకపోవడంతో ..

ఇన్‌చార్జి అధికారులు పూర్తిస్థాయిలో విద్యాశాఖపై పట్టుసాధించకపోవడం, క్షేత్రస్థాయిలో పాఠశాలలను తనిఖీలు చేపట్టకపోవడంతో విద్యా వ్యవస్థ గాడి తప్పింది. కొంతమంది ఉపాధ్యాయులు వారికి నచ్చినప్పుడే వెళ్లడం, సమయానికంటే ముందే ఇంటి ముఖం పట్టడం, ఇటీవల ఫేషియల్‌ అటెండెన్స్‌ ఉన్నప్పటికీ సమయపాలన పాటించడం లేదనే విమర్శలున్నాయి. పలువురు టీచర్లు బోధనను విస్మరించి సొంత పనులు, ఇతర వ్యాపకాల్లో నిమగ్నం కావడంతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన జరుగడం లేదనే ఆరోపణలున్నాయి. హెచ్‌ఎంలకు ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు ఇవ్వడంతో వారు కార్యాలయానికే పరిమితమవుతున్నారు. ఇన్‌చార్జీలే కావడంతో ఉపాధ్యాయులపై అజామాయిషీ చేయలేకపోతున్నారు. దీంతో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కొత్తగా బాధ్యతలు నిర్వర్తించనున్న డీఈవో ఈ శాఖను ఏ మేరకు గాడిలో పెడతారో వేచి చూడాల్సిందే మరి.

డీఈవో పరిధిలోని పాఠశాలల వివరాలు

మొత్తం పాఠశాలలు : 739

ప్రాథమిక : 500

ప్రాథమికోన్నత : 119

ఉన్నత : 120

మొత్తం విద్యార్థులు : 57,896

మొత్తం ఉపాధ్యాయ పోస్టులు : 3066

పనిచేస్తున్న ఉపాధ్యాయులు : 2602

ఉపాధ్యాయ ఖాళీలు : 462

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement