‘పారిశ్రామిక’ అడుగు | - | Sakshi
Sakshi News home page

‘పారిశ్రామిక’ అడుగు

May 30 2026 3:14 AM | Updated on May 30 2026 3:14 AM

● తొలిదశపై యంత్రాంగం ఫోకస్‌ ● భోరజ్‌ మండలంలో భూముల సర్వే ● త్వరలో నోటిఫికేషన్‌.. ప్రజాభిప్రాయ సేకరణ?

సాక్షి,ఆదిలాబాద్‌: జిల్లాలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు అడుగు పడింది. తొలి దశలో భోరజ్‌ మండలంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములను పరిశీలించారు. జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు ఆదిలాబాద్‌ ఆర్డీవో జగదీశ్వర్‌, భోరజ్‌ తహసీల్దార్‌ రాథోడ్‌ రాజేశ్వరి ఆధ్వర్యంలో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి ఇటీవల సర్వే ప్రక్రియ చేపట్టారు. అయితే దీనికి సంబంధించి యంత్రాంగం అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం మేరకు ఈ భూములకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేసి ప్రజాభిప్రాయ సేకరణకు ముందుకెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.

సీఎం ప్రకటన నేపథ్యంలో..

జిల్లాలో 10వేల ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో జిల్లాలో పర్యటించిన సందర్భంగా ప్రకటించిన విషయం విదితమే. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి పర్యవేక్షిస్తారని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్‌ రెడ్డితో పాటు మంత్రి జూపల్లి, ప్రభుత్వ అధికారులు పెన్‌గంగ సరిహద్దులో హెలిక్యాప్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే కూడా చేశారు. తాజాగా భోరజ్‌ మండలంలో భూముల గుర్తింపు కోసం సర్వే నిర్వహించడం ఈ పారిశ్రామిక వాడ ఏర్పాటుకు తొలి అడుగుగా పేర్కొంటున్నారు.

సర్వే ఇలా..

ఇటీవల ప్రభుత్వ యంత్రాంగం నియమించిన నాలుగు బృందాలు భోరజ్‌ మండలంలోని గూడ, రాంపూర్‌, గిమ్మ, హత్తిఘాట్‌ గ్రామాల్లో పర్యటించాయి. ఈ బృందాలు వ్యవసాయంతో పాటు వ్యవసాయేతర భూములను కూడా సర్వే చేశాయి. ఇందులో ఆ భూములకు సంబంధించి రైతులు మోఖాపై ఉన్నారా అనేది పరిశీలించారు. దానికి సంబంధించి ఎన్ని ఎకరాల్లో ఉన్నాయనేది గుర్తించారు. దీనిపై ప్రాథమిక నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు పంపించినట్లు సమాచారం. కాగా 2062 ఎకరాలు ఈ సర్వేలో గుర్తించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ప్రజాభిప్రాయ సేకరణ..

గుర్తించిన భూములకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేసిన తర్వాత ఆయా గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారని ప్రచారం జరుగుతుంది. దాంట్లోనే ఆ భూములకు సంబంధించి పరిహారం, ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా జిల్లాలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు సంబంధించి ఎన్ని ఎకరాల భూమి అందుబాటులో ఉందనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని నివేదిక కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం భూములకు సంబంధించి తొలి దశలో సర్వే చేసి ఆ నివేదిక పంపించినట్లుగా ప్రభుత్వ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఈ విషయంలో ఆదిలాబాద్‌ ఆర్డీవో జగదీశ్వర్‌ను వివరణ కోరేందుకు ఫోన్‌లో యత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement