కై లాస్‌నగర్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంను జూన్ 2న జిల్లా వ్యాప్తంగా వైభవంగా, అధికారికంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన ఈ శుభదినం పురస్కరించుకొని జిల్లా కేంద్రంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. జూన్ 1, 2 తేదీల్లో జిల్లాలోని అన్ని ముఖ్య ప్రభుత్వ కార్యాలయాలు, చారిత్రక కట్టడాలను విద్యుత్ దీపాలంకరణతో తీర్చిదిద్దాలన్నారు వేడుకల్లో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరణ, అమరవీరుల స్మారక స్తూపాల వద్ద నివాళులు అర్పించే కార్యక్రమాల్లో ప్రొటోకాల్ కచ్చితంగా పాటించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో అదనపు కలెక్టర్లు ఎస్.రాజేశ్వర్, ఆర్‌ఎస్ చిత్రు, ఏవో వర్ణ, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
అన్‌లోడింగ్ రవాణా ప్రక్రియ వేగవంతం చేయాలి
జొన్నల అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జొన్నల కొనుగోలు, రవాణా, గోదాముల నిర్వహణ, హమాలీల కేటాయింపులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జొన్నల కొనుగోలుతో పాటు రవాణా, అన్‌లోడింగ్ ప్రక్రియ యుద్ధప్రతిపాదికన పూర్తి చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్‌ఎస్.చిత్రు, మార్క్‌ఫెడ్ డీఎం మహేశ్‌కుమార్, మార్కెటింగ్ అధికారి గజానంద్, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా కార్మిక శాఖ అధికారి ముత్యం, సీడబ్ల్యూసి మేనేజర్ రవి, ట్రాన్స్‌పోర్ట్, హమాలీ కాంట్రాక్టర్లు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


