రాష్ట్ర రాజధాని నగరంలో ఇటీవల చోటు చేసుకున్న అభయ ఘటనతోపాటు నిర్భయ చట్టం కింద నమోదైన కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదం తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నగరంలో ఇటీవల చోటు చేసుకున్న అభయ ఘటనతోపాటు నిర్భయ చట్టం కింద నమోదైన కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదం తెలిపారు. మహిళలపై నేరాల నియంత్రణ విషయంలో తక్షణ చర్యల సూచనల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతిని ఆదేశించారు. అభయ ఘటన నేపథ్యంలో మహిళలమీద జరుగుతున్న నేరాల నియంత్రణపై పోలీసు ఉన్నతాధికారులతో సచివాలయంలో శుక్రవారం సీఎం సమీక్షించారు. అభయ ఘటనల వంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలపై జరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, వీటిల్లో ఐటీ కంపెనీలను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు.
మహిళలపై నేరాల్లో సైబరాబాద్ మొదటి స్థానం
రాష్ట్రంలో మహిళలపై నేరాల సంఖ్య ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 24.64 శాతం పెరిగింది. గతేడాది మొదటి ఆరు నెలల్లో 12,731 కేసులు నమోదుకాగా... ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఆ సంఖ్య 15,868కు పెరిగింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1,285 కేసులు మొదటి ఆరు నెలల్లో నమోదయ్యాయి. విజయవాడ సిటీ (915), హైదరాబాద్ సిటీ (870 కేసులు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.