లక్ష్యం ఒలింపిక్స్‌

Gymnastics Ananya Garikapati Special Story - Sakshi

దేశానికి బంగారు పతకం తేవాలనేదే కల

‘రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌’ అనన్య గరికిపాటి

అంతర్జాతీయ పోటీల్లో బంగారు పతకం కైవసం

సెల్యూట్‌ కప్‌లో సిల్వర్‌

గోరస్క్‌ స్టార్స్‌లో స్పెషల్‌ ప్రైజ్‌ సొంతం

ఆమె వయస్సు 16 సంవత్సరాలు. జిమ్నాస్టిక్స్‌లో ఆమె చేసే విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మాస్కోలో జరిగిన అంతర్జాతీయ ‘రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌’ పోటీల్లో మొట్టమొదటి సారి బంగారు పతకాన్ని సాధించి దేశం కళ్లు ఆమెవైపు తిప్పుకునేలా చేసింది అనన్య గరికిపాటి. సరదా కోసం ప్రారంభించిన జిమ్నాస్టిక్స్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు, పేరు, ప్రఖ్యాతలను సాధించుకుంది. రానున్న ఒలింపిక్స్‌లో దేశానికి బంగారు పతకం సాధించాలనే ఆశయంతో ముందుకెళ్తున్న అనన్య గరికిపాటిపై ప్రత్యేక కథనం.

 బాచుపల్లిలో నివాసముండే గరికిపాటి శ్రీధర్, డాక్టర్‌ పద్మజల మొదటి కుమార్తె అనన్య. సిల్వర్‌ ఓక్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్లో టెన్త్‌ పూర్తి చేసిన ఆమె గాంజెస్‌ వ్యాలీ హైస్కూల్లో ప్రస్తుతం 11వ తరగతి చదువుతోంది. చిన్నప్పుడు తన ఫ్రెండ్స్‌ జిమ్నాసిక్ట్‌ చేస్తున్నప్పుడు చూసి తను కూడా సరదా కోసం ఆడటం ప్రారంభించింది. ఫ్రెండ్స్, టీచర్స్, ఇంట్లోవాళ్లు, బంధువులు అంతా బాగా చేస్తున్నావ్‌ అనే కాంప్లిమెంట్స్‌ రావడంతో ఆటపై మక్కువ పెంచుకున్నారు. 2010 ఢిల్లీ కామన్‌వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌ నాజ్మీజాన్‌స్టన్‌ వద్ద 2016లో కోచింగ్‌ తీసుకున్నారు.  

ఇవీ సాధించిన పతకాలు
పలు దేశాల్లో నిర్వహించిన అంతర్జాతీయ రిథమిక్‌ జిమ్నాసిక్స్‌ పోటీల్లో అనన్య సత్తా చాటింది. జూనియర్‌ విభాగాల్లో బంగారు, కాంస్యం, వెండి పతకాలను సాధించి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.  
2016లో లండన్‌లో జరిగిన ‘లండన్‌ స్ప్రింగ్‌కప్‌’ పోటీల్లో మూడు కాంస్య పతకాలు, ఆల్‌రౌండ్‌ విభాగంలో మరో మూడు కాంస్య పతకాలు, ‘మిస్‌హోప్‌ ట్రోఫీ’ కైవసం చేసుకుంది.  
2016 దుబాయిలో జరిగిన ‘డూజియంకప్‌’ పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించింది.
2017 తాష్‌కంట్‌ ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన పోటీల్లో ఆల్‌రౌండ్‌లో సిల్వర్‌తో పాటు ‘మిస్‌ ఎమోషన్‌ క్రౌన్‌ పతకం’ సాధించింది.  
2017 దుబాయిలో జరిగిన ‘ఎమిరేట్స్‌ కప్‌’లో ఒక కాంస్య పతకం, ఒక స్పెషల్‌ ప్రైజ్‌.     
2018లో మాస్కోలో జరిగిన పోటీల్లో ఒక స్పెషల్‌ ప్రైజ్, బాల్‌ విభాగంలో థర్డ్, ఫ్రూఐజ్‌ క్లబ్స్‌లో 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది.  

లండన్‌ స్ప్రింగ్‌కప్‌తో ఆరంభం
2016లో లండన్‌లో ‘లండన్‌ స్ప్రింగ్‌ కప్‌’ పేరుతో మేజర్‌ ఇంటర్నేషనల్‌ పోటీలు జరిగాయి. పోటీల్లో అప్పుడు జూనియర్‌గా ఉన్న అనన్య పాల్గొని ఆల్‌రౌండ్స్‌లో తన ప్రతిభ కనబర్చింది. ఈ పోటీల్లో మూడు కాంస్య పతకాలతో పాటు, ఆల్‌రౌండ్‌ మిస్‌హోప్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది.  

మాస్కోతో మనసు దోచుకుంది
మే నెలలో ‘మాస్క్వో’ దేశంలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో దేశం నుంచి ‘రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌’ విభాగంలో అనన్య ఒక్కరే పాల్గొన్నారు. ఈ పోటీల్లో తన ప్రతిభను కనబరచి దేశం మొత్తం తనవైపు తిప్పుకునేలా చేసింది. ఇక్కడ జరిగిన ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ టోర్నమెంట్స్‌లో ‘జూనియర్స్‌ స్టార్‌లో ఆర్‌రౌండ్‌ విభాగంలో బంగారు పతకం, స్పెషల్‌ ప్రైజ్‌తో పాటు మిస్‌ ఛాంపియన్‌షిప్‌ను కూడా సొంతం చేసుకుంది. ‘సెల్యూట్‌ కప్‌’లో ఆర్‌రౌండ్‌ విభాగంలో సిల్వర్, సీనియర్‌ విభాగంలో ‘నోవాగోర్స్‌ స్టార్స్‌’లో ఆర్టిస్ట్రీ విభాగంలో స్పెషల్‌ ప్రైజ్‌ను సాధించింది.  

ఒలింపిక్స్‌లో గోల్డ్‌ నా డ్రీమ్‌
ఒలింపిక్స్‌ పోటీల్లో పాల్గొనాలనేది జిమ్నాస్టిక్స్‌ నేర్చుకున్నప్పుడు కన్న కల. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. ఈ ప్రయత్నాలు ప్రస్తుతం సంతృప్తిని ఇస్తున్నప్పటికీ.. నా డ్రీమ్‌ అంతా ఒలింపిక్సే. ఒలింపిక్స్‌లో పాల్గొని రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌ విభాగంలో దేశానికి బంగారు పతకం తేవాలనేది నా డ్రీమ్, నా లక్ష్యం, నా కర్తవ్యం కూడా.– అనన్య గరికిపాటి

టాలెంట్‌ గుర్తించాం
అనన్యలో టాలెంట్‌ ఉంది. ఆ టాలెంట్‌ను గుర్తించాం. అందుకే నా డాక్టర్‌ వృత్తిని కూడా పక్కన పెట్టి మరీ అనన్యకు తోడుగా ఉంటున్నాను. విదేశాలకు వెళ్లడం, రావడం, ఆడటం కష్టంగా ఉన్నప్పటికీ అనన్య కలల్ని సాకారం చేయాలనేదే మా కోరిక. అందుకే తనని ప్రతి అంశంలో ప్రోత్సహిస్తున్నాం. రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌లోని నాలుగు విభాగాల్లో అనన్య అందర్నీ ఆకట్టుకోవడం తల్లిగా నాకు చాలా సంతోషంగా ఉంది.
– డాక్టర్‌ పద్మజ గరికిపాటి,అనన్య తల్లి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top