కాల్మనీ-సెక్స్ రాకెట్ కేసులో మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కాల్మనీ ముఠా ఆర్థిక మూలాలపై టాస్క్ఫోర్స్ ఆరా తీస్తోంది.
విజయవాడ : కాల్మనీ-సెక్స్ రాకెట్ కేసులో మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కాల్మనీ ముఠా ఆర్థిక మూలాలపై టాస్క్ఫోర్స్ ఆరా తీస్తోంది. టీడీపీ నేతలు, ఎన్ఆర్ఐల పెట్టుబడులు ఉన్నట్లు సమాచారంతో ఆ దిశగా విచారణ కొనసాగుతోంది. కొందరు ప్రవాస భారతీయులతోపాటు ఇక్కడ ఆర్థికంగా స్థితిమంతులైన ఎన్జీవో నేతలు కాల్‌మనీ సెక్స్ రాకెట్ ముఠా తరఫున పెట్టుబడులు పెట్టిన వ్యవహారం విచారణలో వెలుగులోకి వస్తోంది.
విచారణలో భాగంగా ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం సహా పలుచోట్ల కాల్ మనీ-సెక్స్ రాకెట్ ముఠా పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు విచారణలో గుర్తించారు. మరోవైపు ఈ కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు చెన్నుపాటి శ్రీనివాసరావు, వెనిగళ్ల శ్రీకాంత్ కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా వారి సన్నిహితులు, బంధువుల ద్వారా నిందితులపై ఒత్తిడి తెస్తున్నారు. గత్యంతరం లేక నిందితులు లొంగుబాటు యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ ప్రముఖల ద్వారా వారు లొంగిపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న పెండ్యాల శ్రీకాంత్ను టాస్క్ఫోర్స్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.