ఫేక్‌ సర్వే సూత్రధారి తేజోభాను అరెస్ట్‌

టీఎఫ్‌సీ మీడియా డైరెక్టర్‌ శాకమూరి తేజోభాను - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎఫ్‌సీ సంస్థ డైరెక్టర్‌ శాకమూరి తేజోభానూని ఎట్టకేలకు జూబ్లీహిల్స్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ఇంటెలిజెన్స్‌ సర్వే పేరుతో ఫేక్‌ సర్వే విడుదల చేసిన టీఎఫ్‌సీ సంస్థపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న తేజోభానును పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.  వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్‌ సర్వే చేసిందంటూ టీఎఫ్‌సీ మీడియా ఓ తప్పుడు కథనాన్ని సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ చేసింది. అయితే తాము ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి సర్వే చేయలేదని అది పూర్తిగా ఫేక్‌ అంటూ ఈ నెల 2వ తేదీన తెలంగాణ ఇంటెలిజెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌  హరిప్రసాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పోలీసులు శాకమూరి తేజోభానుతో పాటు ఫేక్‌ సర్వే స్క్రిప్ట్‌ రైటర్‌ ముప్పాళ్ళ ప్రసన్నకుమార్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఈ నెల 7న ప్రసన్నకుమార్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న తేజోభానుకు తాజాగా నోటీసులు జారీ చేసి అరెస్ట్‌ చేశారు. మరో డైరెక్టర్‌గా ఉన్న సంయుక్త...ఆమె వీడియో మార్ఫింగ్‌ చేసే సమయంలో ఆ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నారా లేక రాజీనామా చేసి వెళ్ళారా అనే విషయంలో స్పష్టత కోసం పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా టీఎఫ్‌సీ మీడియా కార్యాలయం ఉన్న జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 36లోని ఎన్‌బీకే కాంప్లెక్స్‌లోను, బంజారాహిల్స్‌లోను, సాగర్‌ సొసైటీ కార్యాలయంలోను పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్కడ ఈ ఫేక్‌ సర్వేను అప్‌డేట్‌ చేసేకంటే ముందే కార్యాలయాలు ఖాళీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top