ఫోర్టిస్‌ రేసు నుంచి తప్పుకున్న ముంజాల్‌–బర్మన్‌

IHH Healthcare, Manipal-TPG submit fresh bids for Fortis - Sakshi

బరిలో ఐహెచ్‌హెచ్, మణిపాల్‌–టీపీజీ

న్యూఢిల్లీ: ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ సంస్థ కొనుగోలు రేసు ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటిదాకా బరిలో ముందున్న ముంజాల్‌–బర్మన్‌ కుటుంబాలు తాజాగా పక్కకు తప్పుకున్నాయి. ఫోర్టిస్‌ కొత్తగా బిడ్లు ఆహ్వానించినప్పటికీ.. ముంజాల్‌–బర్మన్‌ సవరించిన బిడ్లు దాఖలు చేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, మలేషియాకి చెందిన ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్, మణిపాల్‌–టీపీజీ సవరించిన బిడ్లు దాఖలు చేశాయి.

బైండింగ్‌ బిడ్‌ దాఖలు చేసినట్లు ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌.. స్టాక్‌ ఎక్స్చేంజీలకు తెలియజేయగా, మణిపాల్‌–టీపీజీ కూడా బరిలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.  జులై 3 నాటికి కొత్తగా వచ్చిన బిడ్లను పరిశీలించనున్నట్లు స్టాక్‌ ఎక్స్చేంజీలకు ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ తెలియజేసింది. సవరించిన నిబంధనల ప్రకారం ఫోర్టిస్‌ను కొనుగోలు చేసే సంస్థ ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌ ద్వారా కనీసం రూ. 1,500 కోట్లు ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది.

అలాగే ఆర్‌హెచ్‌టీ హెల్త్‌ ట్రస్ట్‌ కొనుగోలుకు నిధుల సమీకరణ ప్రణాళిక, డయాగ్నస్టిక్స్‌ సేవల అనుబంధ సంస్థ ఎస్‌ఆర్‌ఎల్‌ నుంచి ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్లు వైదొలిగేందుకు అవకాశం కల్పించే ప్రణాళిక మొదలైనవి సమర్పించాల్సి ఉంటుంది.  2001లో మొహాలీలో తొలి ఆస్పత్రిని ప్రారంభించిన ఫోర్టిస్‌కు ప్రస్తుతం దేశవిదేశాల్లో 45 హెల్త్‌కేర్‌ కేంద్రాలు ఉన్నాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top