సీమాంధ్రలో ఉద్యమ సెగలు ఏమాత్రం చల్లారడం లేదు. రాష్ట్ర విభజనపై ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో సీమాంధ్రుల ఆగ్రహ జ్వాల రోజురోజుకూ ఉధృతమవుతుంది.
హైదరాబాద్ : సీమాంధ్రలో ఉద్యమ సెగలు ఏమాత్రం చల్లారడం లేదు. రాష్ట్ర విభజనపై ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో సీమాంధ్రుల ఆగ్రహ జ్వాల రోజురోజుకూ ఉధృతమవుతుంది. 11వ రోజు కూడా ర్యాలీలు, ఆందోళనలతో సీమాంధ్ర జిల్లాలు అట్టుడుకుతున్నాయి. మరోపక్క వివిధ సంఘాలు సమ్మెలకు పిలుపునిస్తుండటంతో పరిస్థితి మరింత భయానకంగా మారుతోంది. కర్నూలు జిల్లా కోడుమూరులో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా 910 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.
చిత్తూరు జిల్లాలోనూ బంద్ కొనసాగుతుంది. పదకొండో రోజు కూడా విద్యా సంస్థలు, దుకాణలు తెరుచుకోవటం లేదు. సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో బంద్ జరుగుతుంది. జేఏసీ ఆధ్వర్యంలో తిరుపతిలో మహా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. మరోవైపు మున్సిపల్ కార్యాలయంలో జేఏసీ చేపట్టిన నిరసన దీక్షలు 11వ రోజుకు చేరాయి. టీటీడీ ప్రధాన పరిపాలన భవనం వద్ద టీటీడీ ఉద్యోగుల దీక్ష ఆరోరోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్యాలయం 11వ రోుజకు చేరిన జేఏసీ నిరసన దీక్షలు
మరోవైపు సమైక్య వాణిని కాంగ్రెస్ అధిష్ఠానానికి వినిపించేందుకు 12వ తేదీ నుంచి ఢిల్లీలో నిఠాహార దీక్షలు చేపట్టనున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు నిన్న వెల్లడించారు. సమైక్యాంధ్ర ప్రదేశ్ కోసం అపోహలు విస్మరించి అంతా ఒక్క తాటిపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.