సమైక్యాంధ్ర పరిరక్షణకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లాలో బుధవారం రెండో రోజూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
కర్నూలు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లాలో బుధవారం రెండో రోజూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి పిలుపులో భాగంగా రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును నిరసిస్తూ చేపట్టిన నిరసనకు సమైక్య వాదులు స్వచ్ఛందంగా మద్దతిచ్చారు. నంద్యాలలోని సిటీకేబుల్ కార్యాలయం వద్ద మహిళలు అధిక సంఖ్యలో దీక్షబూనారు. ఆలూరు అంబేద్కర్ సర్కిల్‌లో నియోజకవర్గ ఇన్‌చార్జి గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో హుళేబీడు గ్రామానికి చెందిన పది మంది మహిళలు నిరాహార దీక్ష నిర్వహించారు.
ఆదోని భీమాస్ సర్కిల్‌లో వైఎస్సార్సీపీ యువజన విభాగానికి చెందిన ఎనిమిది మంది కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. స్థానిక నాయకులు ప్రసాదరావు, చంద్రకాంత్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డిలు వీరికి పూలమాలలు వేసి మద్దతు పలికారు. ఆళ్లగడ్డలో పార్టీ నేత బి.వి.రామిరెడ్డి ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల కూడలిలో నిర్వహించిన శిబిరంలో ఆచారి కాలనీకి చెందిన 13 మంది పార్టీ శ్రేణుల్లో దీక్ష చేపట్టారు. డోన్‌లోని పొట్టి శ్రీరాములు సర్కిల్‌లో ఐదుగురు కార్యకర్తలు నిరాహార దీక్ష నిర్వహించారు. కోడుమూరు పాతబస్టాండ్ వద్ద దీక్ష చేస్తున్న 11 మంది వర్కూరు గ్రామస్తులకు నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ, పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు యు.వి.రాజారెడ్డి తదితరులు సంఘీభావం ప్రకటించారు.
ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్‌లో కేడీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నందవరం మండలానికి చెందిన పది మంది పార్టీ కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. నందికొట్కూరు పటేల్ సెంటర్‌లో పార్టీ నాయకుడు బండిజయరాజు ఆధ్వర్యంలో 20 మంది కార్యకర్తలు.. ఆత్మకూరు మండల కన్వీనర్ ఏరువా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కొత్తబస్టాండ్ వద్ద 30 మంది పార్టీ కార్యకర్తలు దీక్ష చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 150 మంది పార్టీ కార్యకర్తలు రిలే దీక్షల్లో పాల్గొనగా సమైక్యవాదులు పెద్ద ఎత్తున శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు.