ఆచార్య ఎన్జీరంగా వర్సిటీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ప్రపంచ వ్యవసాయ ఫోరం కాంగ్రెస్-2013 కన్వీనర్‌గా పదవికి రాజీనామా చేశారు.
సాక్షి, హైదరాబాద్: ఆచార్య ఎన్జీరంగా వర్సిటీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య ప్రపంచ వ్యవసాయ ఫోరం కాంగ్రెస్-2013 కన్వీనర్‌గా పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతికి తన రాజీనామా పత్రాన్ని మెయిల్ ద్వారా పంపారు. రైతుల సంక్షేమం కోసం కాకుండా కార్పొరేట్ సంస్థలకు రెడ్‌కార్పెట్ వేస్తూ సదస్సు లక్ష్యాలను పక్కదోవపట్టిస్తున్నందుకు నిరసనగానే పదవినుంచి తప్పుకుంటున్నట్లు జానయ్య ‘సాక్షి’కి తెలిపారు. వివిధ దేశాల వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొనాల్సి ఉండగా, కేవలం వివిధ ప్రైవేటు విత్తన కంపెనీల ప్రతినిధులకు అవకాశం ఇవ్వడం మరో కారణమని చెప్పారు. వరల్డ్ అగ్రికల్చర్‌ఫోరం అంతర్జాతీయ సలహామండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేశానని చెప్పారు.
ఆర్థిక బాధ్యతల నుంచి తప్పించడమే కారణమా..?
ప్రపంచ వ్యవసాయ సదస్సు నవంబర్ 5 నుంచి నగరంలో ప్రారంభం కానుండగా ఆ ఫోరం కన్వీనర్ పదవినుంచి జానయ్య రాజీనామా చేయడం వెనక ఆర్థిక కారణాలు ఉన్నాయన్న చర్చ యూనివర్సిటీ వర్గాల్లో కొనసాగుతోంది. ప్రపంచ వ్యవసాయ సదస్సు సన్నాహక ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం రూ.50 లక్షలు కన్వీనర్ జానయ్య అకౌంట్‌లో వేసింది. ఈ నిధుల వినియోగానికి సంబంధించి జానయ్య నిబంధనలు పాటించని విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పునేత స్వయంగా యూనివర్సిటీకి వెళ్లి ఆ అకౌంట్ వ్యవహారాలపై దర్యాప్తు చేశారు. జానయ్య అకౌంట్ సీజ్ చేసి ఆ డబ్బును వ్యవసాయ శాఖ కమిషనర్ మధుసూదన రావు ఖాతాలోకి జమచేయించారు. ఈ నేపథ్యంలోనే జానయ్య రాజీనామా చేశారన్న వాదనలు సెక్రటేరియట్, యూనివర్సిటీ వర్గాల్లోనూ వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రపంచ వ్యవసాయ సదస్సు చైర్మన్ బెకర్ కూడా చీఫ్ సెక్రటరీకి ఫోన్‌చేసి జానయ్య వ్యవహార సరళిపై అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం.