17న నల్లబ్యాడ్జీలతో విధులు | TGEJAC Activity: Duties with black badges on 17th April | Sakshi
Sakshi News home page

17న నల్లబ్యాడ్జీలతో విధులు

Apr 8 2026 6:03 AM | Updated on Apr 8 2026 6:03 AM

TGEJAC Activity: Duties with black badges on 17th April

సమావేశంలో మాట్లాడుతున్న మారం జగదీశ్వర్‌. చిత్రంలో ఏలూరి శ్రీనివాసరావు తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం దొరకలేదని, ఇప్పటికే పలుమార్లు వినతులు సమర్పించినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి (టీజీఈజేఏసీ) తెలిపింది. ఆరోజు భోజన విరామ సమయంలో నిరసనలు తెలియజేస్తామని వెల్లడించింది. మే 5వ తేదీన అన్ని జిల్లా కేంద్రాలు, కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌లు, ధర్నాచౌక్‌ల వద్ద దీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఆలోపు ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకుంటే మే 14వ తేదీన జేఏసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు ప్రకటించారు. మంగళవారం మూసారాంబాగ్‌లోని రెవెన్యూ భవన్‌లో జేఏసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రాథమిక కార్యాచరణను వారు మీడియాకు వెల్లడించారు.  

ఇప్పటికే రెండేళ్ల పీఆర్సీ నష్టపోయాం.. 
‘సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల పీఆర్సీ ప్రభుత్వం అమలు చేయలేదు. ఇప్పటికే రెండున్నరేళ్లు నష్టపోయాం. తాజాగా పీఆర్సీ గడువును పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కమిటీ నివేదిక తీసుకోకుండా గడువును పొడిగించడం సరికాదు.  

చనిపోయినా అందని రిటైర్మెంట్‌ బెనిఫిట్లు 
పెండింగ్‌ బిల్లుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నెలవారీగా నిధులిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా.. ప్రతినెలా జరిగే రిటైర్మెంట్లతో బకాయిలు తగ్గడం లేదు. పదవీ విరమణ పొందిన వారిలో ఇటీవల 260 మంది చనిపోయారు. అయినప్పటికీ వారికి రిటైర్మెంట్‌ బెనిఫిట్లు అందలేదు. 

సీపీఎస్‌ రద్దుపై కమిటీ ఏదీ? 
కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటివరకు కనీసం కమిటీ ఏర్పాటు చేయలేదు. ఈ డిమాండ్ల సాధన కోసమే నిరసనలు, దీక్షలకు దిగుతున్నాం..’అని జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు కూడా విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కాగా పాత పింఛన్‌ విధానాన్ని ఉద్యోగులందరికీ పునరుద్ధరించాలని ఈ భేటీలో పాల్గొన్న కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సీపీఎస్‌ఈయూ) ప్రతినిధి నాగులవంచ నరేందర్‌రావు డిమాండ్‌ చేశారు. లక్షలాది ఉద్యోగులతో ముడిపడి ఉన్న ఈ అంశం పరిష్కారమయ్యేంతవరకు పోరాటాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. 

జేఏసీ డిమాండ్లు ఇవీ.. 
⇒ 2వ పీఆర్సీ కమిషన్‌ నివేదిక తెప్పించి జూన్‌ 2 లోగా అమలు చేయాలి. పీఆర్సీ గడువు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించకూడదు.  
⇒ ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులు రూ.700 కోట్లు విడుదల చేసినప్పటికీ, వాస్తవ అవసరం రూ.1,500 కోట్లకు పైగా ఉంది. రాష్ట్రంలో నెలకు సగటున 600 మంది ఉద్యోగులు రిటైర్మెంట్‌ తీసుకుంటున్నారు. దీంతో బకాయిలు భారీగా పేరుకుపోతున్నాయి. మిగిలిన మొత్తం విడుదల చేయడంతో పాటు ప్రతి నెలా విడుదల చేసే మొత్తం రూ.1,500 కోట్లకు పెంచాలి. 
⇒ ఉద్యోగుల ఆరోగ్య పథకం వెంటనే అమలు చేస్తామని సీఎస్‌ చెప్పినప్పటికీ ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించడం లేదు. ఈహెచ్‌ఎస్‌ లేక ఉద్యోగులు పెన్షనర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పథకం విధివిధానాలను వెంటనే ఖరారు చేసి, మే 1వ తేదీ నుంచి వైద్య సేవలు అందించాలి. 

⇒ కాంట్రిబ్యూషన్‌ పెన్షన్‌ (సీపీఎస్‌) రద్దుచేసి పాత పెన్షన్‌ స్కీంను పునరుద్ధరించాలి.  
⇒ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు చేపట్టాలి. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని త్వరితగతిన ఏర్పాటు చేయాలి. 
⇒ ఉపాధ్యాయ సంఘాల కో–ఆర్డినేషన్‌ సమావేశం ఏర్పాటు చేయాలి. ఉపాధ్యాయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేకుంటే టీజీఈజేఏసీ క్షేత్రస్థాయిలో అతనికి తగిన శాస్తి చేస్తుంది. 
⇒ కొన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రధానంగా జనగామ జిల్లా కలెక్టర్‌ అక్కడి ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ చేయించాలి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement