భార్య, భర్తనే కాదు... పిల్లలను కూడా బలి తీసుకుంటున్నారు
ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, ఒంటరితనం, కుంగుబాటు ఇలా కారణాలు అనేకం
మార్చి 31
వరంగల్ జిల్లాకు చెందిన స్రవంతి తన భర్త వేధింపులు తాళ లేక ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఇదే రోజు రంగారెడ్డి జిల్లాకు చెందిన బాణావత్ రాందాస్ నాయక్ తాగిన మైకంలో గొడవకు దిగి భార్య, కొడుకు, కూతురుపై రోకలి, చాకుతో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య, కొడుకు మృతి చెందారు.
ఏప్రిల్ 3
కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీశైలం కవల ఆడపిల్లలు పుట్టారని తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఏప్రిల్ 3వ తేదీన ఇద్దరు పిల్లలకు గడ్డిమందు తాగించి బావిలో పడేశాడు. దీంతో ఇద్దరూ మృత్యువాత పడ్డారు.
ఏప్రిల్ 4
పటాన్‌చెరుకు చెందిన పరమేశ్వరరావు తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఏప్రిల్ 4వ తేదీన కూరగాయలు కోసే కత్తితో గొంతు కోసి చంపాడు.
సాక్షి, హైదరాబాద్: మన దేశంలో కుటుంబ ఆత్మహత్యలు, హత్య–ఆత్మహత్యల సంఘటనలు ఒక తీవ్రమైన ప్రజారోగ్య, సామాజిక సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. ఒంటరితనం, కుంగుబాటు, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, చదువు, ఒత్తిడి వంటి కారణాలతో మరణం తప్ప మరోమార్గం లేదని... హింసాత్మక ప్రవృత్తితో ఇతరులను చంపడమో, తాము ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇటీవలి పోకడలను గమనిస్తే ఇవి కేవలం విడివిడి సంఘటనలే కాకుండా... తీవ్రమైన ఆర్థిక, సామాజిక, మానసిక క్షోభకు దారితీసే లక్షణాలుగా కనిపిస్తున్నాయి.
కుటుంబ సంబంధిత సమస్యల కారణంగా దంపతులు పిల్లలతో సహా ఆత్మహత్యలు చేసుకోవడమో లేదా పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకోవడమో, భార్యాపిల్లలను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకోవడం లాంటి ఘటనలతో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. 2022–2026 మధ్యకాలంలో ఆత్మహత్యల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా అప్పులు, పేదరికం, నిరుద్యోగం, వివాహేతర సంబంధాలు అనేవి కుటుంబాలు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. రోజువారీ కూలీలు, ఆ తర్వాత గృహిణులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల్లో ఆత్మహత్యల రేటు అత్యధికంగా ఉండడం వారి ఆర్థిక దుర్బలత్వాన్ని సూచిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో (తెలంగాణతో సహా) అప్పులు లేదా గృహ సమస్యల కారణంగా పిల్లలతో సహా మొత్తం కుటుంబం విషం తాగడం లేదా ఉరి వేసుకోవడం వంటి సంఘటనలు, సామూహిక ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.
కుటుంబ కలహాలు, ఆర్థిక ఒత్తిళ్లు లేదా మానసిక అనారోగ్యం వంటి కారణాల వల్ల, ఒక కుటుంబ సభ్యుడు ఇతరులను (భార్య/భర్త పిల్లలను) చంపి ఆత్మహత్య చేసుకునే కేసులు ఇటీవల గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా బాధితుల్లో గణనీయమైన సంఖ్యలో ‘గృహిణులు’ఉంటున్నారు. వీరి ఆత్మహత్యలు తరచుగా వ్యక్తిగత సమస్యలు, గృహ హింస లేదా తీవ్రమైన ఆర్థిక సమస్యలు, గృహ ఒత్తిడితో ముడిపడి ఉన్నట్టుగా వెల్లడైంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) డేటా ప్రకారం 2023లో ఆత్మహత్య బాధితులలో 66% మంది అత్యల్ప ఆదాయ వర్గానికి (సంవత్సరానికి రూ.1 లక్ష లేదా అంతకంటే తక్కువ సంపాదించేవారు) చెందినవారు ఉన్నారు.
చావులు పరిష్కారం కాదనే అవగాహన, మ్యారేజీ కౌన్సెలింగ్ పెంచాలి
నేటి సమాజంలో యువత, దంపతులకు తాహతుకు మించి ఆశలు పెరుగుతున్నాయి. తమ జీవితం, ఆర్థిక పరిస్థితులు, సమాజం తదితరాల పట్ల స్పష్టమైన అవగాహన లేక ప్రతిష్టకు పోయి సమస్యల్లో కూరుకుపోతున్నారు. నేటితరం ఆడంబరంగా పెళ్లిళ్లు, ఆ తర్వాత ఖర్చుతో కూడుకున్న ట్రిప్‌లు, పెద్దపెద్ద ఇళ్లు, ఖరీదైన ఫోన్లు, వాహనాలు...ఇలా లెక్కకుమిక్కిలి ఖర్చులతో ఆర్థికపరంగా చిక్కుల్లో కూరుకుపోతున్నారు.
దీంతో అక్రమ మార్గాల్లో ఆదాయం పెంచుకోవడంపై దృష్టితో తాగుడు, డ్రగ్స్, చెడు వ్యసనాలు, బెట్టింగ్‌లకు బానిసలై హింసా ప్రవృత్తితో హత్యలకు, కుంగుబాటుతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పరంగా హత్యలు, ఆత్మహత్యలు పరిష్కారం కాదనే అవగాహనతోపాటు మ్యారేజీ కౌన్సెలింగ్ విస్తృతం చేయాలి. కుంగుబాటు, మానసిక ఒత్తిళ్లు పెరుగుదల వంటి వాటిని ముందుగానే గుర్తించి కౌన్సెలర్‌లను సంప్రదిస్తే సమస్యల పరిష్కారానికి అవకాశం కలుగుతుంది. డిజిటల్ యుగంలో సెల్‌ఫోన్‌తో ఎవరితోనైనా ఎక్కడి నుంచైనా సులభంగా కనెక్ట్ అవుతున్నారు. ‘పోర్న్’కూడా యువత, ఇతర వర్గాలను విపరీతంగా ప్రభావితం చేస్తోంది. - సి.వీరేందర్, సైకాలజిస్ట్
కుటుంబ ఆధారిత వ్యవస్థ, సోషల్ సపోర్ట్ సిస్టమ్ ఏది ?
ఇప్పుడు కుటుంబ ఆధారిత వ్యవస్థ, సోషల్ సపోర్ట్ సిస్టమ్ కనుమరుగవుతోంది. సమస్యలు, కుంగుబాటు వంటివి తలెత్తితే ఇంట్లోని పెద్దవారు సరిదిద్దేవారు. కుటు ంబ సంబంధాలు, ఆర్థిక సమస్యలు, ఇతర రూపాల్లో సవాళ్లు ఎదురైనప్పుడు వాటిని ఎలా అధిగమించాలో చాలామందికి తెలియడం లేదు. చదువు పూర్తి కాగానే ఏడ ంకెల జీతాలు, విలాసాలతో కూడుకున్న జీవనం, సౌకర్యాలు కోరుకుంటున్నారు.
దానికి తగ్గట్టుగా విద్యార్హతలు, తాహతు లేకపోతే కుంగుబాటుకు గురికావడం, వ్యక్తిగత సంబంధాల్లో భేదాభిప్రాయాలు, భాగస్వాముల మధ్య స్పర్థలు, కోపా లు, ఆవేశాలు పెరిగిపోయి హత్యలు, ఆత్మహత్యలే శరణ్యమనే స్థాయికి చేరుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా మనుషులను కనెక్ట్ చేయడానికి బదులు ఏకాకులను చేయడానికే ఎక్కువ ఉపయోగపడుతోంది. రోజులో ఎక్కువ సమయం సెల్‌ఫోన్లు, టీవీల్లో మునిగి మనుషుల్లో ఏకాకితనం పెరుగుతోంది. - డా. నిశాంత్ సైకియాట్రిస్ట్


