కోర్టుకు నలుగురు ఎమ్మెల్యేల రాజీనామా వివాదం హైకోర్టుకు ప్రభుత్వం వివరణ స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టీకరణ
సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల అనర్హత, రాజీనామాల వివాదం వ్యవహారం సోమవారం మద్రాస్ హైకోర్టుకు చేరింది. నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నాయంటూ చేసిన ప్రకటనను రద్దు చేయాలని, కోర్టులో కేసు ముగిసే వరకు సదరు 4 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించకుండా స్టే విధించాలని విన్నవిస్తూ చేస్తూ అన్నాడీఎంకే విప్ అగ్రి కృష్ణమూర్తి తరపున ఈ పిటిషన్ హైకోర్టులో దాఖలైంది. అయితే ఈ వ్యవహారంలో చట్ట నిబంధనల ప్రకారం సహజ న్యాయ సూత్రాలకు లోబడే స్పీకర్ చర్యలు తీసుకుంటారని తమిళనాడు ప్రభుత్వ కోర్టుకు స్పష్టం చేసింది.
వివాదం – రాజీనామా
అన్నాడీఎంకేకు చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు నలుగురు తమ పదవులకు రాజీనామా చేసి, టీవీకేలో చేరిన విషయం తెలిసిందే. వీరిపై అనర్హత వేటుకు సంబంధించిన ఫిర్యాదు పెండింగ్‌లో ఉన్న తరుణంలో స్పీకర్ జేసీడీ ప్రభాకర్ వారి రాజీనామాలను ఆగమేఘాలపై ఆమోదించడం చర్చకు దారి తీసింది. తొలుత మరకదం కుమారవేల్, జయకుమార్, సత్యభామా రాజీనామాలను స్పీకర్ ఆమోదించి, ఆ స్థానాలు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించారు. ఆ తదుపరి ఇసక్కి సుబ్బయ్య రాజీనామాను ఆమోదించి నాలుగు స్థానాలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నట్టు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
కోర్టులో పిటిషన్
అనర్హత వేటు పడకుండా తప్పించుకోవడానికి ఈ ఎమ్మెల్యేలు రాజీనామా మార్గాన్ని ఎంచుకోవడంపై సామాజిక కార్యకర్త ఎం.ఎల్. రవి , అన్నాడీఎంకే విప్ అగ్రి కృష్ణమూర్తిలు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత ప్రక్రియ విచారణలో ఉన్నప్పుడు, ఒక ఎమ్మెల్యే రాజీనామాను స్పీకర్ అంత తొందరగా ఎలా ఆమోదిస్తారు? ఇది చట్టవిరుద్ధం అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పార్టీలు ఫిరాయించి, స్వార్థ రాజకీయాల కోసం రాజీనామాలు చేయడం వలన ఆ నియోజకవర్గాల్లో మళ్లీ ఉప ఎన్నికలు పెట్టాల్సి వస్తున్నదని, దీని కారణంగా ప్రభుత్వంపై, ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతున్నదని వివరించారు. రాజీనామాను ఆమోదిస్తూ స్పీకర్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని, ఈ కేసు తేలే వరకు ఆయా నియోజకవరా్గాల్లో ఉప ఎన్నికలు జరగకుండా నిలిపివేయాలని కోర్టుకు విన్నవించారు.
కోర్టులో ప్రభుత్వ వాదన – వాయిదా
సోమవారం ఈ పిటిషన్ విచారణకు రాగా, అన్నాడీఎంకే తరఫున సీనియర్ న్యాయవాది రాజాగోపాల్ వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ విజయ్ నారాయణ్ జోక్యం చేసుకున్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు తమ స్వచ్ఛంద నిర్ణయంతోనే రాజీనామా చేశారని, దీనిపై స్పీకర్ చట్టప్రకారమే నోటీసులు పంపి నిర్ణయం తీసుకున్నారని ఆయన కోర్టుకు వివరించారు. వాడివేడిగా సాగిన వాదనల అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం న్యాయమూర్తులు బుధవారానికి వాయిదా వేశారు.


