విద్యుదాఘాతంతో మహిళ మృతి
● రక్షించడానికి వెళ్లిన సోదరుడూ దుర్మరణం
అన్నానగర్ : శంకరపురం సమీపంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మరణించారు. కల్లకురిచి జిల్లాలోని శంకరపురం సమీపంలో ఉన్న పుదుపాలపట్టులో, కల్వరాయన్ కొండ పాదాల వద్ద నదీతీరం దగ్గర రాజీ నివసిస్తున్నాడు. ఇతని భార్య సెల్వి (36). ఆదివారం రాత్రి శంకరపురం ప్రాంతంలో వర్షం కురిసింది. అర్ధరాత్రి వేళ కూడా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో, సెల్వి ఇంటి బయట జెండా పై వేలాడదీసిన బట్టలు తీయడానికి వెళ్లింది. అప్పుడు ఆమె విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఆమె కేకలు వేసింది. ఆ శబ్దం విన్న రాజీ సోదరుడైన గణేషన్ (47) పరుగెత్తుకుంటూ వెళ్లి సెల్వి ని కాపాడటానికి ప్రయత్నించాడు. ఇందులో అతను కూడా విద్యుదా ఘాతానికి గురయ్యాడు. వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. స్థానిక పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
బాలికను కిడ్నాప్ చేసి
లైంగిక వేధింపులు
– డ్రైవర్ అరెస్ట్
తిరువొత్తియూరు: పూందమల్లి సమీపంలో ఒక మైనర్ బాలికపై జరిగిన లైంగిక వేధింపులకు సంబంధించి శరవణన్ (40) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేర కు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పూందమల్లి పోలీసులు, అతనిని మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మహిళా పోలీసులు, శిశు సంక్షేమ శాఖ అధికారులు జరిపిన విచారణ అనంతరం, నిందితుడిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
మరో ఘటనలో..
పడపై సమీపంలో ఆదనూరు ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ బిహార్‌కు చెందిన జయశాంత్ (43) తో సహా ఇతర కార్మికులు ఈ ప్రాంతంలో పనులు చేస్తున్నారు. ఆదివారం రాత్రి అదే ప్రాంతానికి చెందిన 10 ఏళ్ల బాలిక రోడ్డుపై వెళ్తుండగా, ఆమెను వెంబడించిన జయశాంత్ హఠాత్తుగా ఆ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడి, కార్మికుడు జయశాంత్‌ను పట్టుకుని బంధించి దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని మణిమంగళం పోలీసులకు అప్పగించారు. పోలీసులు జయశాంత్‌ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
ప్రేమపేరుతో వంచన
– ఆటో డ్రైవర్ అరెస్టు
తిరువళ్లూరు: ఆరేళ్లుగా ప్రేమపేరుతో వంచించి మరో యువతిని పెళ్లి చేసుకున్న ఆటో డ్రైవర్‌ను వెంగల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా వెంగల్ కారణి ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల యువతి, టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తోంది. ఈమె వెంగల్ సమీపంలోని మాగరల్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ హరి(24)ని గత ఆరు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నట్టు తెలుస్తోంది. హరికి ఈఎంఐ పద్ధతిలో ఆటోతోపాటు బంగారు చైన్, బ్రేస్‌లెట్, ఉంగరం తదితర వాటిని సైతం యువతి ఇచ్చింది. దీంతో పాటు హరి యువతి ఇంటికి తరచూ రాకపోకలు సైతం సాగించాడు. ఈ క్రమంలో హఠాత్తుగా రెండు వారాల క్రితం హరి వేరొక అమ్మాయిని రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు తెలు స్తుంది. ఈ సంఘటనతో షాక్‌కు గురైన యువతి ఊత్తుకోట మహిళా పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి నిందితుడికి 14 రోజులపాటు రిమాండ్ విదించడంతో అతడ్ని పుళల్ జైలుకు తరలించారు.
60 సవర్ల బంగారు నగలు చోరీ
● 5 లక్షల నగదు సైతం... పెద్దపాళ్యంలో కలకలం
తిరువళ్లూరు: పెద్దపాళ్యం సమీపంలో వృద్ధ దంపతులను బెదిరించి 60 సవర్ల బంగారు నగలు, ఐదు లక్షల నగదు, వెండి వస్తువులను ఎత్తుకెళ్లిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా పెద్దపాళ్యం సమీపంలోని అత్తింగకావనూరు గ్రామానికి చెందిన రైతు రాజగోపాల్(65). ఇతడికి భార్య కౌసల్యతోపాటు ఆడిటర్ సతీష్‌కుమార్, డాక్టర్ వరదరాజన్ తదితర ఇద్దరు కొడుకులు, జయంతి అనే కుమార్తె ఉన్నారు. వీరందరికి వివాహమై గుమ్మిడిపూండి, చైన్నె తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. అత్తింగకావనూరు గ్రామంలోని ఇంట్లో రాజగోపాల్, అతడి భార్య కౌసల్య ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రస్తున్న సమయంలో తలుపులు పగలగొట్టి ఇంట్లోకి చొరబడిన పూజ గదిలో వుంచిన బీరువాను తెరిచినట్టు తెలుస్తుంది. బీరువాను తెరిచినట్టు శబ్దం రావడంతో అక్కడికి వచ్చిన కౌసల్యను బెదిరించి బీరువాలోని 55 సవర్ల బంగారు నగలు, కౌసల్య మెడలో ఉన్న ఐదు సవర్ల బంగారు గొలుసును లాక్కెళ్లారు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి వచ్చిన పెద్దపాళ్యం పోలీసులు విచారణ చేపట్టారు. సంఘటన స్థలంలో వేలిముద్రలను సేకరించడంతోపాటు పోలీసు జాగిలాన్ని రప్పించి విచారణను ముమ్మరం చేశారు.
పోక్సో కేసులో యువకుడి అరెస్టు
వేలూరు: రాణిపేట జిల్ల సిప్‌కాట్ సమీపంలోని ఒక గ్రామానికి చెందిన 14 సంవత్సరాల చిన్నారి ఉంది. గత కొద్ది రోజుల క్రితం వారి తల్లిదండ్రులు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. చిన్నారి మాత్రం ఇంటిలో ఒంటరిగా ఉండడాన్ని గమనించి అదే గ్రామానికి చెందిన వారి బంధువు దినేష్‌కుమార్ చిన్నారి ఇంటికి వచ్చి లైంగిక వేధింపులు చేసినట్లు తెలుస్తుంది. దీంతో చిన్నారి కేకలు వేసింది. దీంతో దినేష్‌కుమార్ అక్కడ నుంచి పరుగులు తీశాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లి చిన్నారి తల్లిదండ్రులు వచ్చిన వెంటనే జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు సిప్‌కాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టి దినేష్‌కుమార్‌ను అరెస్టు చేశారు.


