నరబలి ఇచ్చినట్లు బంధువుల ఫిర్యాదు
వేలూరు: వేలూరు జిల్లా పేర్నంబట్టు సమీపంలోని మేల్‌పట్టి గ్రామానికి చెందిన రాజేష్, ఆశ దంపతులకు వివాహం జరిగి, గత ఐదు సంవత్సరాలుగా ఇద్దరు విడివిడిగా జీవిస్తున్నారు. అయితే గత రెండు నెలలుగా కలిసి జీవిస్తున్నట్లు తెలుస్తుంది. వీరి ఆరు సంవత్సరాల కుమారుడు ముగిలన్(6) మేల్‌పట్టి ఆచ్చారి వీధిలోని రాజేష్ తల్లి విజయ ఇంటిలో గత ఒక నెల రోజులుగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఉన్నపళంగా ఇంటిలోనే మృతి చెందినట్లు గుర్తించి తల్లిదండ్రులకు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బంధువులు చిన్నారి ముగిలన్ మృతదేహం వద్దకు చేరుకొని చూడగా శరీరం పూర్తిగా తీవ్ర గాయాలతో మృతి చెంది ఉండడాన్ని గమనించి మేల్‌పట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడియాత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చిన్నారి ఉంటున్న ఇంటిలో ఉన్న అవ్వ విజయ తరచూ మాంత్రికం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇల్లు పూర్తిగా మాంత్రికం చేసేందుకు ఉపయోగించే వస్తువులు ఉన్నట్లు, పసుపు, కుంకుమ, దేవుడు ఫొటోలు, తాయత్తులు, పసుపు దారాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆదివారం అమావాస్య కావడంతో చిన్నారి అవ్వ విజయ చిన్నారిని చిత్ర హింసలు పెట్టి బలి ఇచ్చి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే చిన్నారి గోడపైకి ఎక్కి కింద పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం అమావాస్య కావడంతో అవ్వ విజయతో ఉన్న సమయంలో ఏదైనా చిత్ర హింసలు పెట్టి నరబలి ఇచ్చారా అనే కోణంలోను పోలీసులు విచారణ చేస్తున్నారు. అవ్వ విజయ ఉంటున్న ఇల్లు పూర్తిగా విబూది, కుంకుమ, దేవుడి ఫొటోలు, తదితర మాంత్రికానికి ఉపయోగించే వస్తువులు ఉండడంతో పలు కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా భర్తను, కుమారుడిని విడి పోయి జీవిస్తున్న తల్లి ఆశ ప్రస్తుతం రెండు నెలులుగా కుమారుడిని హత్య చేసేందుకు కలిసి జీవిస్తున్నట్లు నటించిందా అనే కోణంలోను పోలీసులు విచారణ ప్రారంభించారు.


