పెరంబలూర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

పెరంబలూర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Jun 16 2026 1:52 AM | Updated on Jun 16 2026 1:52 AM

– లారీని ఢీకొట్టిన కారు

– ముగ్గురు ఉద్యోగుల దుర్మరణం

సాక్షి, చైన్నె: పెరంబలూర్‌లో సోమవారం వేకువ జామున ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్‌ టెలికాం సంస్థకు చెందిన కారు నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు ఉద్యోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. పెరంబలూర్‌ జిల్లా సెంజేరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని టి.కళత్తూర్‌ క్రాస్‌ రోడ్డు వద్దకు రాగానే, కారు ఒక్కసారిగా డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయింది. రోడ్డుకు అవతలి వైపునకు దూసుకెళ్లి.. పెరంబలూర్‌ నుండి కరూర్‌ వైపు ఇనుప చువ్వల లోడ్‌తో వెళ్తున్న లారీని అత్యంత వేగంగా, బలంగా ఢీకొట్టింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న సెంజేరి పోలీసులు తక్షణమే అక్కడికి చేరుకున్నారు. కారు శిథిలాల నుండి మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం పెరంబలూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా తురయూర్‌ – పెరంబలూర్‌ జాతీయ రహదారిపై కొంత సమ యం పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు క్రేన్‌ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించడంతో రద్దీ సాధారణ స్థితికి వచ్చింది. చైన్నె పెరంబూర్‌ భారతి నగర్‌కు చెందిన శంకర్‌(37), అరియలూరు జిల్లా అరిసానత్తం గ్రామానికి చెందిన విజయ్‌(30), సన్నానల్లూరుకు చెందిన శక్తి(21) ఈ ప్రమాదంలో మరణించారు. వీరంతా ప్రముఖ ప్రైవేట్‌ టెలికాం సంస్థలో కేబుల్స్‌ రిపేరింగ్‌ విభాగంలో సాంకేతిక సిబ్బందిగా పనిచేస్తున్నారు. ఈరోడ్‌ జిల్లాలో నెలకొన్న కేబుల్‌ నెట్‌వర్క్‌ సాంకేతిక సమస్యను పరిష్కరించడానికి వీరు కారులో వెళ్లారు. అక్కడ పని ముగించుకుని, రాత్రికి రాత్రే కారులో అరియలూర్‌ వైపు తిరుగు ప్రయాణమయ్యారు. కారును శక్తి నడిపాడు. రా త్రంతా ప్రయాణం చేయడంతో కారు నడుపుతున్న శక్తి తెల్లవారుజామున నిద్రమత్తులోకి జారుకున్నాడని . ఆ కారణంగానే కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టిందని పేర్కొంటూ సెంజేరి పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement