క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Jun 16 2026 1:52 AM | Updated on Jun 16 2026 1:52 AM

క్యాన్సర్‌ రోగుల కోసం ప్లువిక్టో థెరపీ

సాక్షి, చైన్నె: ప్రోస్టేట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగుల కోసం డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ ఆమోదిత రేడియోలిగాండ్‌ థెరపీ ప్లువిక్టోను సిద్ధం చేశామని నోవార్టిస్‌ ఇండియా ఎండీ అమితాబ్‌ దూబే వ్యాఖ్యానించారు. ఈ థెరపీ గురించి సోమవారం స్థానికంగా ఆయన వివరిస్తూ, చాలా మంది ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ రోగులు వ్యాధి ముదిరిన తర్వాత ఆస్పత్రికి వస్తున్నారన్నారు. ఇలాంటి తరుణంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఈ రేడియోలిగాండ్‌ థెరపిని భారత్‌కు తీసుకు వచ్చామన్నారు. రోగులకు ఈ చికిత్స సులభంగా అందేలా ఆస్పత్రులతో దీర్ఘకాలిక భాగస్వామ్యంపై దృష్టి పెట్టనున్నామన్నారు. ప్రతి సంవత్సరం 2,50,000 కంటే ఎక్కువ కొత్త ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయని గుర్తుచేస్తూ, ఈ క్యాన్సర్‌ బారిన పడుతున్న వారిలో దాదాపు 50 శాతం మంది మంది రోగులకు అది చివరి దశకు చేరిన తర్వాతే వ్యాధి నిర్ధారణ అవుతోందన్నారు.ప్లు విక్టో అంటే ప్రిసిషన్‌ ఆంకాలజీ అని సాధారణ కీమో థెరపీలాగా కాకుండా టార్గెటెడ్‌ రేడియోలిగాండ్‌ థెరపీ విధానంలో ఇది పనిచేస్తుందన్నారు.

వర్తకుల కోసం

‘సెల్లర్‌ అసిస్టెంట్‌’

సాక్షి, చైన్నె: లక్షలాది మంది చిన్న, మధ్య తరహా వర్తకుల కోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతికతతో పనిచేసే ‘సెల్లర్‌ అసిస్టెంట్‌’ను రూపకల్పన చేశామని అమెజాన్‌ ఇండియా సెల్లర్‌ ఎక్స్‌ పీరియన్స్‌ విభాగం డైరెక్టర్‌ అభిజిత్‌ కమ్రా ప్రకటించారు. సోమవారం స్థానికంగా ఈ సాంకేతికతను ఆవిష్కరించి, ఇందులోని అంశాలను స్థానికంగా వివరించారు. జూలైలో జరిగే 10వ ఎడిషన్‌ అమెజాన్‌ ప్రైమ్‌ డే 2026ను దృష్టిలో ఉంచుకుని సేల్స్‌కు ముందే వ్యాపారులకు మరింత ఊతం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 24 గంటలూ అందుబాటులో అత్యాధునిక ఏఐ మోడల్స్‌ ఆధారంగా రూపొందించబడిన ఈ సెల్లర్‌ అసిస్టెంట్‌, వ్యాపారులకు ఒక స్మార్ట్‌ బిజినెస్‌ భాగస్వామిగా సహాయ పడుతుందన్నారు. వ్యాపారులు తమ సందేహాలను నేరుగా చాట్‌ రూపంలో అడిగి తెలుసుకోవచ్చు అని, లాభాల అంచనాలు, ఫీజుల వివరాలు, ఏ వస్తువులను ఎక్కువగా స్టాక్‌ పెట్టుకోవాలనే విషయాలను ఇది క్షణాల్లో విశ్లేషించి చెప్తుందన్నారు.

ప్రత్యర్థుల దాడుల్లో యువకుడు, యువతికి కత్తిపోట్లు

అన్నానగర్‌: అంబత్తూరు సమీపంలోని ఒరగడం ప్రాంతానికి చెందిన రిషి (26). ఇతనికి తిరుముల్లైవాయల్‌, సరస్వతి నగర్‌కు చెందిన కొందరితో పాత కక్షలు ఉన్నాయి. సోమవారం ఉదయం రిషి వారి పై దాడి చేశాడని తెలుస్తోంది. ఈ స్థితిలో, ప్రతిపక్ష వర్గం ఈ విషయమై చర్చలు జరపడానికి ఒరగడం సమీపంలోని పుళల్‌ సరస్సు ఒడ్డుకు రిషికి సెల్‌ ఫోన్‌ ద్వారా పిలిచింది. రిషి తన సోదరుడు దర్శన్‌తో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లాడు. ఆ సమయంలో, అక్కడికి వచ్చిన ఒక గుర్తుతెలియని ముఠా కత్తితో రిషిని నరికింది. ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన దర్శన్‌ అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన రిషి, కిల్పాక్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మరో ఘటన..

ఆవడి సమీపంలోని కోవిల్‌పదగై సరస్సు ప్రాంతంలో నివసించే ధనలక్ష్మి, జీవిత మధ్య ఇప్పటికే వివాదం నెలకొని ఉంది. ఈ ఘటనలో, జీవిత భర్త ఆనందన్‌, ధనలక్ష్మితో గొడవ విషయమై వాగ్వాదానికి దిగి, ఆమె పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ధనలక్ష్మి కిల్పాక్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయమై ఆవడి ట్యాంక్‌ ఫ్యాక్టరీ పోలీసులు కేసు నమోదు చేసి, సోమవారం ఉదయం ఆనందన్‌ను అరెస్టు చేశారు.

గుండె చికిత్స

పీఎ్‌ఫ్‌ఏ సాంకేతికత

సాక్షి, చైన్నె: గుండె సంబంధిత సమస్యల చికిత్సలో మరో విప్లవాత్మక అడుగు చైన్నెలో పడింది. అత్యంత అధునాతనమైన పల్స్‌డ్‌ ఫీల్డ్‌ అబ్లేషన్‌(పీఎఫ్‌ఏ) చికిత్సా విధానాన్ని కావేరి ఆస్పత్రి సోమవారం ప్రకటించింది. అలాగే, 69 ఏళ్ల వృద్ధురాలికి గంటలో జరిగిన శస్త్ర చికిత్స విజయవంతం గురించి వివరించారు. ఆస్పత్రి కార్డియాక్‌ ఎలక్ట్రోఫిజియాలజీ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ దీప్‌ చంద్‌ రాజా మాట్లాడుతూ, తమిళనాడు వైద్య చరిత్రలోనే మొదటిసారిగా, 3డీమ్యాపింగ్‌ సౌకర్యంతో కూడిన రెండు వేర్వేరు గ్లోబల్‌ టెక్నాలజీలను ఒకే సారి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఆళ్వార్‌పేట్‌లో మెడ్‌ట్రానిక్‌ పల్స్‌సెలెక్ట్‌ టెక్నాలజీ, వడపళనిలో అత్యాధునిక 3డీ హార్ట్‌ మ్యాపింగ్‌ టెక్నాలజీతో అనుసంధానించామన్నారు. పాత పద్దతిని పక్కన పెట్టి కొత్త ఏఐ ఎలక్ట్రికల్‌ పద్ధతిలో కంట్రోల్డ్‌ ఎలక్ట్రికల్‌ పల్స్‌ (విద్యుత్‌ తరంగాల) ద్వారా గుండె లయను తప్పించే కణాలను మాత్రమే ఎంచుకుని ఈ విధానం నాశనం చేస్తుందన్నారు. ఇప్పటికే ముగ్గురు రోగులకు ఈ విధానంలో విజయవంతంగా చికిత్స అందించామని, గత రెండేళ్లుగా గుండె దడతో బాధపడుతున్న 69 ఏళ్ల వృద్దురాలికి సైతం తాజాగా విజయవంతం చేశామన్నారు. సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ ఎన్‌.ఎస్‌. శివకటాక్షం, ఆస్పత్రి సహ వ్యవస్థాపకుడు అరవిందన్‌ సెల్వరాజ్‌, మెడికల్‌ సూపరింటెండెంట్‌ మహేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement