జలవనరుల నిర్వహణలో అప్రమత్తత అవసరం | - | Sakshi
Sakshi News home page

జలవనరుల నిర్వహణలో అప్రమత్తత అవసరం

Jun 16 2026 1:52 AM | Updated on Jun 16 2026 1:52 AM

● అధికారులకు మంత్రి ఆనంద్‌ సూచన ● నీటి వనరుల పరిస్థితులపై సమీక్ష

సాక్షి,చైన్నె : రుతు పవనాల కాలంలో జల వనరుల నిర్వహణ, పర్యవేక్షణలో అప్రమత్తత అవశ్యమని అధికారులకు నీటి వనరుల శాఖ మంత్రి ఎన్‌. ఆనంద్‌ సూచించారు. నాణ్యతలో లోపాలు ఉంటే శాఖాపరమైన చర్యలు తప్పదని హెచ్చరించారు. మంత్రి ఎన్‌. ఆనంద్‌ అధ్యక్షతన సోమవారం జల వనరులు, నీటి పరివాహక ప్రదేశాల ప్రగతిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులు, రాబోయే వర్షాకాల సన్నద్ధతపై ఈ సమావేశంలో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఉమ్మడి తాగు నీటి పథకాల కీలక పనుల పురోగతిని పరిశీలించారు. కొత్త సాగునీటి మౌలిక వసతుల నిర్మాణాలు , ప్రస్తుతం ఉన్న సాగునీటి వ్యవస్థల ఆధునికీకరణ పనులు, భూగర్భ జలాల పెంపొందించే ప్రాజెక్టులు, వరద నివారణ , ముందస్తు రక్షణ చర్యలు, జలాశయాల నిర్వహణ, సముద్ర తీర కోత నివారణ చర్యలు, చెరువులు, జలాశయాల పునరుద్ధరణ, వాటి రక్షణ గురించి సమీక్షించారు. అలాగే తుపానులు, రుతుపవనాల రాకకంటే ముందే చేపట్టాల్సిన పూడికతీత , ముందస్తు పనులను ఆరా తీశారు. ప్రధానంగా చైన్నె నగరంలో వరద ముప్పును తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలు, గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులు, కొత్తగా ప్రకటించిన ప్రాజెక్టులు , వాటికి అవసరమైన నిధుల లభ్యతపై కూడా ఈ సమావేశంలో సమగ్రంగా సమీక్షించారు.

పనుల్లో వేగం.. ఫిర్యాదులపై కఠిన చర్యలు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పనులన్నింటినీ అత్యంత నాణ్యతా ప్రమాణాలతో, శరవేగంగా పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రజల వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను మంత్రి ఆనంద్‌ ఆదేశించారు. పనుల నాణ్యతలో గానీ, నిర్వహణలో గానీ ఏవైనా ఫిర్యాదులు వస్తే వాటిపై తక్షణమే విచారణ జరపాలని, తప్పు రుజువైతే సంబంధిత అధికారులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసమావేశంలో నీటి వనరుల శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సత్యప్రద సాహు , ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎస్‌. శ్రీధరన్‌, నీటి వనరుల శాఖ ప్రధాన ఇంజనీర్‌ ఎస్‌. గోపాల కృష్ణన్‌,తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement