తమిళసినిమా: కరు.పళనియప్పన్ 2003లో పార్టీషన్ అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. నటుడు శ్రీకాంత్, స్నేహ జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. కరు.పళనియప్పన్ తొలి చిత్రంతోనే ఉత్తమ నూతన దర్శకుడిగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకున్నారు. ఆ తరువాత విశాల్ హీరోగా శివప్పధికారం, చేరన్, స్నేహ జంటగా పిరివోమ్ చిత్రాలతోపాటు సందీప్పోమ్, మందిరపున్నగై, చతురంగం, జన్నల్ ఓరమ్ తదితర వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారు. అదే విధంగా హౌస్ ఫుల్, నట్పే తునై, డీ బ్లాక్, యాదుమ్ ఊరే యావరుమ్ కేళీర్ తదితర కొన్ని చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. ఆ మధ్య ఒక ప్రైవేట్ ఛానల్‌లో చర్చావేదిక కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ప్రముఖ రాజకీయవాది, నటుడు కరు కరుప్పయ్య ఈయన తండ్రి పెద్ద సహోదరుడు అన్నది గమనార్హం. చాలా గ్యాప్ తరువాత కరు.పళనియప్పన్ మళ్లీ మెగా ఫోన్ పట్టారు. నటుడు కాళీ వెంకట్ ప్రధాన పాత్రను పోషిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి కుక్కర్ అనే టైటిల్‌ను పెట్టారు. ఈ టైటిల్‌ను మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఎంకే స్టాలిన్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారితోపాటు నటుడు కాళీ వెంకట్, ఛాయాగ్రాహకుడు రాజశేఖర్ తదితరులు ఉన్నారు.


