తమిళసినిమా: నటుడు రవి మరియ కథానాయకుడిగా నటించిన చిత్రం మక్కళ్ తలైవా. నటుడు రాధారవి, పళ.కరుప్పయ్య, నాంజిల్ సంపత్, దర్శకుడు పేరరసు, గంజా కరుప్పు, కవితాలయ శరవణన్, అగ్ని ఎస్.వరుణ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని కవితాలయ శరవణన్ క్రియేషన్స్, రామ్‌దేవ్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రామ్‌దేవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కార్తీక్ ఎస్.నాయర్ ఛాయాగ్రహణం, తులసి రామన్ సంగీతాన్ని అందించారు. రాజకీయం, వినోదం కలగలిపి రూపొందిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఇందులో దర్శకుడు ఆర్కే సెల్వమణి, కె.భాగ్యరాజ్ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దర్శకుడు ఆర్కే సెల్వమణి మాట్లాడుతూ రవి మరియ మంచి నటుడే కాకుండా మంచి దర్శకుడు అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలోని ప్రదర్శించిన రెండు పాటలు బాగుందన్నారు. ట్రైలర్ ప్రదర్శించడం లేదా అని అడగ్గా సెన్సార్ సమస్య కారణంగా ప్రదర్శించడం లేదు అని చెప్పారన్నారు. సాధారణంగా ఇలాంటి ప్రివ్యూ థియేటర్లో ట్రైలర్స్ ప్రదర్శించేటప్పుడు సెన్సార్ సర్టిఫికెట్ గురించి ఆలోచించరన్నారు. అయితే ఏదైనా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉంటే ప్రివ్యూ థియేటర్లో ప్రదర్శించడానికి సంకోచిస్తారన్నారు. అలాంటి సమస్య ఏదో ఈ చిత్ర ట్రైలర్‌లో ఉండి ఉంటుందన్నారు. తాము చిత్రాలు చేసేటప్పుడు పెద్దగా సెన్సార్ సమస్యలు తలెత్తేవి కాదన్నారు కొంచెం స్వేచ్ఛ ఉండేదని అన్నారు. ఇప్పుడు నిర్మాతలకు తెలియని భయం కలుగుతోంది అన్నారు. ఈ చిత్రం చేద్దామా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇస్తుందా ప్రభుత్వం అనుమతిస్తుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఒక దర్శకుడు ఒక నిజాన్ని చెప్పడానికి చాలా భయపడాల్సి వస్తోందన్నారు. కల్పితాలు, హింసాత్మక సంఘటనలు, గ్లామర్, అసత్యాలు ఇలా అన్నీ చెప్పవచ్చు కానీ నిజాలు మాత్రం సినిమాల్లో చెప్పకూడదు అని ఆర్కే సెల్వమణి పేర్కొన్నారు.


