సాక్షి, చైన్నె: నవజాత శిశువులు , పిల్లలలో వచ్చే వినికిడి లోపాలు, శ్వాసకోశ ఇబ్బందులు, నిద్రలేమి సమస్యల నివారణకు చైన్నె వైద్య రంగంలో ఒక సరికొత్త అధ్యాయం అత్యాధునిక పీడియాట్రిక్ ఈఎన్‌టీ కేర్ సెంటర్‌ను ఏర్పాటైంది. ప్రముఖ పిల్లల ఆసుపత్రి గ్రూప్ రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో చైన్నె నగరంలోనే మొట్టమొదటి ఏసెంట్‌గా దీనిని ఏర్పాటు చేశారు. ఇందులో చిన్న పిల్లల కోసం ప్రత్యేకించబడిన అనస్థీషియా లేకుండా శ్వాసనాళ పరీక్షల నిర్వహణతో పాటుగా అన్ని రకాల సమస్యలకు ఒకే చోట పరిష్కారం దిశగా వైద్యులు సేవలు అందించనున్నారు. సోమవారం ఈ సెంటర్‌ను ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ (గాయని) శైంధవి ప్రారంభించారు.ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద, అవగాహణ అవశ్యమని వ్యాఖ్యలు చేశారు. ఆస్పత్రి ఫెసిలిటీ డైరెక్టర్ గుణశేఖర్ మాట్లాడుతూ, తమ హాస్పిటల్‌లో ఎల్లప్పుడూ అత్యాధునిక సాంకేతికత, మల్టీ–డిసిప్లినరీ నిపుణులతో అత్యుత్తమ చికిత్స అందించడమేలక్ష్యంగా పేర్కొన్నారు. కన్సల్టెంట్ – పీడియాట్రిక్ ఈఎన్‌టీ డాక్టర్ డాక్టర్ నిత్య ఆర్ మాట్లాడుతూ పిల్లల్లో వచ్చే వినికిడి, శ్వాసకోశ, నిద్ర సమస్యలను చాలా మంది తాత్కాలికమైనవని నిర్లక్ష్యం చేస్తారన్నారు.అయితే, ఇవి వారి మాటలు, చదువు, శారీరక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వీటిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో త్రివేండ్రం కిమ్స్ హెల్త్ ఆసుపత్రి ఈఎన్‌టీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ – కోఆర్డినేటర్ డాక్టర్ సురేష్ కుమార్‌ను సత్కరించారు.


