కార్వేటినగరం: స్తానిక వేణుగోపాలస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 5వ రోజు బుధవారం రాత్రి గరుడ వాహన సేవ కనుల పండువగా జరిగింది. స్వామివారు గరుడుడిపై కొలువుదీరి ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపి, నిత్యకై ంకర్యాలు చేశారు. ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు స్వామి వారు మోహినీ అవతారంలో పల్లకిలో కొలువై నగర వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. 10 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం చేపట్టారు. రాత్రి టీటీడీ అధికారులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాత్రి 7 గంటలకు విశేషాలంకృతుడైన వేణుగోపాలుడు గరుడ వాహనంపై కొలువుదీరి పట్టణంలో ఊరేగారు. ఈ సందర్భంగా కోలాటాలు, చెక్కభజనలు, రాజమండ్రి వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. అశేష సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.


