సాక్షి, చైన్నె : తమిళనాడు వ్యాప్తంగా మహిళలు, బాలికల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు సరికొత్తగా ఏర్పాటైన సింగప్పెన్ మహిళా ప్రత్యేక పోలీసు దళం బుధవారం నుండి అధికారికంగా రంగంలోకి దిగింది. సీఎం విజయ్ మంగళవారం చైన్నెలో 18 సబ్ యూనిట్లతో ఈ ప్రత్యేక టాస్క్ పోర్సును ప్రారంభించగా, బుధవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ దళం ముమ్మర గస్తీలో నిమగ్నమైంది.
రెండు షిఫ్టుల్లో నిరంతర నిఘా
పోలీస్ కమిషనర్ కార్యాలయాల పరిధిలోని అన్ని కీలక ప్రాంతాల్లో ఈ ప్రత్యేక దళాలు మోహరించాయి. ఒక సబ్–ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో రెండు బృందాలుగా విడిపోయి. ప్రత్యేక ంగా కేటాయించిన వాహనాల్లో ఉదయం నుండి రాత్రి వరకు రెండు షిఫ్టులలో ఈ మహిళా విభాగం భద్రతా విధులను నిర్వహిస్తోంది. జిల్లాలో ఎస్పీల పర్యవేక్షణలో పాఠశాలలు, కళాశాలలు, ,జన సంచారం ఎక్కువగా ఉండే మార్కెట్లు, బస్టాండ్లు , మహిళలు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాల పరిసరాలలో ఈ దళాలు ముమ్మరంగా గస్తీలో నిమగ్నమయ్యాయి. మహిళలపై ఎలాంటి వేధింపులు లేదా అకృత్యాలు జరిగినా క్షణాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకునేలా వీరు పనిచేస్తున్నారు.
ప్రత్యేక శిక్షణ – అసాధారణ ధైర్యం
ఈ ప్రత్యేక ఫోర్స్ గురించి ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ఈ దళంలోని మహిళా పోలీసులకు ప్రత్యేక శిక్షణా కేంద్రాల్లో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారన్నారు. బాధితులైన మహిళలతో అత్యంత దయతో, స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూనే.. వేధింపునకు లేదా దుర్వినియోగానికి పాల్పడే ఆకతాయిలపై సింగప్పెన్ దూకుడుగా , కఠినంగా వ్యవహరించే విధంగా శిక్షణ ఇచ్చి ఉన్నారని వివరించారు. మహిళలకు ఏ ఆపద వచ్చినా తామున్నామనే నమ్మకాన్ని, ధైర్యాన్ని ఈ దళం కలిగిస్తుందని పేర్కొన్నారు. కాగా టాస్క్ ఫోర్స్’ కోసం 2,545 కొత్త పోస్టుల మంజూరు చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించిన కసరత్తులలో అధికారులు ఉన్నారు. ఈ మేరకు ఇన్‌స్పెక్టర్ – జిల్లా ప్రధాన కార్యాలయాల్లో 343 , సబ్–ఇనన్‌స్పెక్టర్లు – 98, ప్రత్యేక సబ్ ఇన్‌స్పెక్టర్లు 540, మహిళా పోలీసు కానిస్టేబుళ్లు 1620 మందిని నియమించేందుకు, కంట్రోల్ – టెక్నికల్ డివిజన్‌లో 2 ఇన్‌స్పెక్టర్ పోస్టులతో పాటు 12 సాంకేతిక సిబ్బంది పోస్టుల రూపకల్పనకు చర్యలు చేపట్టారు.


