ఆస్ట్రేలియా వెటరన్ స్టార్ స్టీవ్ స్మిత్ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026లో చెలరేగిపోయాడు. ఈ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న స్టీవ్.. నిన్న (ఏప్రిల్ 21) రావల్పిండిజ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 167 పరుగుల ఛేదనలో 31 బంతులు ఆడి 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేసి తన విజయంలో ప్రధానపాత్ర పోషించాడు.
4,6,6,6 - MADNESS BY STEVE SMITH. 🔥 pic.twitter.com/aEBz2VEXzT
— Sheri. (@CallMeSheri1_) April 21, 2026
ఈ ఇన్నింగ్స్‌లో స్టీవ్ యువ పేసర్ రజావుల్లాపై చేసిన దాడి మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. రజావుల్లా వేసిన ఓ ఓవర్‌లో స్టీవ్ వరుసగా ఓ బౌండరీ, మూడు సిక్సర్లు బాది వీరంగం సృష్టించాడు. ఈ నాలుగు షాట్లు అభిమానులను ఉర్రూతలూగించాయి. ఇందులో వికెట్ కీపర్‌పై నుంచి కొట్టిన ర్యాంప్ షాట్ దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్‌ను గుర్తు చేసింది.
ఈ హాఫ్ సెంచరీ స్టీవ్‌కు సీజన్‌లో రెండవది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ నుంచే మంచి ఫామ్‌లో ఉన్న స్టీవ్.. ముల్తాన్ సాధించిన ప్రతి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముల్తాన్ ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు రావల్పిండిజ్ ఈ మ్యాచ్‌లో ఓటమితో లీగ్ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్‌తోనే పీఎస్‌ఎల్ అరంగేట్రం చేసిన ఈ జట్టు ఆడిన 8 మ్యాచ్‌ల్లో బోణీ కొట్టని ఏకైక జట్టుగా నిలిచింది.
ముల్తాన్-రావల్పిండిజ్ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పిండిజ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (58 నాటౌట్), డియాన్ ఫారెస్టర్ (37 నాటౌట్) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన ముల్తాన్ స్టీవ్ స్మిత్ (56), ఆస్టన్ టర్నర్ (37 నాటౌట్) చెలరేగడంతో 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి, లక్ష్యాన్ని ఛేదించింది.


