న్యూఢిల్లీ: స్వదేశంలో జరగనున్న ఆసియా సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను (48 కేజీలు) బరిలోకి దిగడం లేదు.
భుజం గాయం నుంచి ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోకపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మే 10 నుంచి 17వ తేదీ జరిగే ఈ మెగా ఈవెంట్‌కు గుజరాత్ రాజధాని గాంధీనగర్ ఆతిథ్యమివ్వనుంది. వాస్తవానికి ఆసియా చాంపియన్‌షిప్ ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీ వరకు జరగాల్సింది.
అయితే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఈ ఈవెంట్ తేదీల్లో మార్పులు చేశారు. మీరాబాయి స్థానాన్ని కోమల్ కొహర్ భర్తీ చేసే అవకాశముంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన మీరాబాయి...గత ఫిబ్రవరిలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్ సందర్భంగా గాయపడింది.
జాతీయ చాంపియన్‌షిప్‌లో మీరాబాయి 48 కేజీల విభాగంలో 205 కేజీలు బరువెత్తి స్వర్ణ పతకం సాధించింది. ‘జాతీయ చాంపియన్‌షిప్‌లో మీరాబాయి భుజానికి గాయమైంది. ఈ గాయం నుంచి ఆమె ఇంకా కోలుకోలేదు.
ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్ ఈవెంట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి ఫిట్‌గా లేకుండానే ఆసియా చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగి రిస్క్ తీసుకోవద్దని ఆమె భావిస్తోంది’ అని మీరాబాయి శిక్షణ బృందం వివరించింది.
👉2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం నెగ్గిన ఈ మణిపూర్ లిఫ్టర్... 2018, 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. ఈసారీ పసిడి పతకం గెలిస్తే ఆమె ‘హ్యాట్రిక్’ సాధిస్తుంది.
కామన్వెల్త్ గేమ్స్ జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరగనున్నాయి. కామన్వెల్త్ గేమ్స్‌లో మీరాబాయి 48 కేజీల విభాగంలో పోటీపడుతుంది.
👉ఆసియా క్రీడలు ఈ ఏడాది సెప్టెంబరు 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లోని ఐచి–నగోయాలలో జరుగుతాయి. 2022 ఆసియా క్రీడల్లో మీరాబాయి నాలుగో స్థానంలో నిలిచింది. మీరాబాయి కెరీర్‌లో ఆసియా క్రీడల పతకమే లోటుగా ఉంది. ఆసియా క్రీడల్లో మీరాబాయి 53 కేజీల విభాగంలో బరిలోకి దిగుతుంది.
👉కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల తర్వాత అక్టోబర్ 27 నుంచి నవంబర్ 8 వరకు చైనాలోని నింగ్బోలో ప్రపంచ చాంపియన్‌షిప్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో మీరాబాయి మూడు పతకాలు గెలిచింది.
👉2017లో స్వర్ణం గెలిచిన ఆమె... 2022లో రజతం, 2025లో రజతం సాధించింది. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీల్లో ప్రపంచ చాంపియన్‌షిప్ కూడా ఉంది. అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య ఇటీవల వెయిట్ కేటగిరీల్లో మార్పులు చేసింది. మీరాబాయి 48 కేజీల విభాగాన్ని తొలగించి ఆ స్థానంలో 53 కేజీల విభాగాన్ని చేర్చారు.


