కాకినాడ: జనసేన నాయకులకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రేపటి నుండి తామేంటో చూపిస్తామంటూ హెచ్చరించారు వర్మ. ‘ వెనుక నుండి టీడీపీ గిల్లితే ఎవరు ఊరుకుంటారు. టీడీపీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు. టీడీపీ బలంగా ఉంది కనుకే పవన్‌కు 70 వేల మెజార్టీ ఇచ్చాం. టీడీపీ బలహీనంగా లేదు.. రేపటి నుండి తామేంటో చూపిస్తాం’ అని హెచ్చరించారు వర్మ.
కాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోజనసేన, టీడీపీల మధ్య చిచ్చు రాజుకుంది. ఫ్లెక్సీ గొడవతో ఇరు వర్గాలు బాహాబాహికి దిగాయి. ఈ క్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి ఎస్‌వీఎస్‌ఎన్ వర్మని జనసేన నేత పెండెం దొరబాబు దాదాపు కొట్టినంత పని చేశారు. ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫొటో లేదు. పవన్ కల్యాణ్ ఫొటో మాత్రం హైలైట్ అయ్యింది. ఇది గమనించిన మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఫొటో ఎందుకు పెట్టలేని అక్కడున్న నేతల్ని నిలదీశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జనసేన నేత తుమ్మలబాబు దురుసుగా సమాధానం ఇచ్చారు. దీంతో ఇరు నేతల మధ్య మాటామాటా పెరిగింది. అక్కడే ఉన్న పెండెం దొరబాబు వర్మతో వాగ్వాదానికి దిగారు. వర్మపైకి దూసుకొస్తూ దాడి చేసే ప్రయత్నం చేయబోయారు. అది గమనించిన తోటి నేతలు ఆయన్ని నిలవరించారు. ఈలోపు టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.
దీనిపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ.. తమ మద్దతుతోనే జనసేన అధ్యక్షుడు పవన్ గెలిస్తే.. తమపైకే దాడి చేయడానికి వస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుండి తామేంటో చూపిస్తామంటూ జనసేన నాయకుల్ని తీవ్రంగా హెచ్చరించారు.


