గుజరాత్‌లోని 1,600 హెక్టార్ల నాలియా గడ్డిభూముల (గ్రాస్‌ల్యాండ్) పరిధిలో నెల రోజుల క్రితం ఓ అరుదైన బట్ట మేక పిట్ట పిల్ల జన్మించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పిల్లను రక్షించడానికి ప్రభుత్వం.. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కూడా కల్పించింది. 24 గంటల పాటు 50 మందికి పైగా కాపలా కాశారు. అయినప్పటికీ ఆ బట్టమేక పక్షి పిల్ల అదృశ్యం కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అయితే గత ఐదు, ఆరు రోజులుగా ఇది కనిపించకపోవడంతో.. ఏదైనా క్రూర జంతువు దానికి అపాయం తలపెట్టి ఉంటుందేమో అని అధికారులు తీవ్రంగా ఆందోళన చెందారు. కనిపించకుండా పోయిన ’గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పిల్ల మిస్టరీ ఏమీ కాదని.. అది ఎగరడం నేర్చుకుందంటూ అధికారులు తేల్చారు. దాదాపు నెల వయసున్న ఆ పక్షి పిల్ల ఎగరడం ప్రారంభించిందన్నారు. ఆ పక్షి జాడ కోసం ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నామని తెలిపారు. పక్షి పిల్ల కావడంతో జియోట్యాగింగ్ చేయలేదని అధికారులు పేర్కొన్నారు.
గుజరాత్‌లో దశాబ్ద కాలంలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పిల్ల జన్మించడం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా అడవుల్లో కేవలం 150 మాత్రమే మిగిలాయి, వాటిలో ఎక్కువ రాజస్థాన్‌లోనే ఉన్నాయి. గత మార్చి 26వ తేదీన కచ్ ప్రాంతంలో ఈ అరుదైన పక్షి జన్మించింది. ఈ నేపథ్యలో దీన్ని కాపాడుకునేందుకు ప్రభుత్వ కూడా పెద్ద ఎత్తున భద్రత కల్పించింది. అలాగే, ఈ పక్షి పిల్ల కదలికలను గమనించడానికి ప్రత్యేకంగా వాచ్ టవర్లను కూడా ఏర్పాటు చేశారు.
పొడవైన తెల్లటి మెడ.. దాని చుట్టూ తెలుపు-నలుపు ఈకల హారం.. బంగారు/గోధుమ వర్ణపు వీపు.. తలపై నల్లని టోపీతో ఇట్టే ఆకర్షించే రూపం బట్టమేక పక్షుల సొంతం. విమానం మాదిరిగా నేలపై పరుగులు తీసి గాల్లోకి లేచి.. స్థిమితంగా.. లయబద్ధంగా విశాలమైన రెక్కలు కదిలిస్తూ గగన విహారం చేయడం వీటి ప్రత్యేకత. అరుదైన బట్టమేక పక్షులు మన దేశంలో అంతరించిపోయే స్థితికి చేరాయి.
కొన్నేళ్లుగా చాలాచోట్ల వీటి జాడ కనిపించడం లేదు. 2008లో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 300 బట్టమేక పక్షులు ఉండగా.. ప్రస్తుతం వాటిసంఖ్య దేశవ్యాప్తంగా 150కి పడిపోయినట్టు తేలింది. ఏవి దొరికినా తిని కడుపు నింపుకోవడం వీటి ప్రత్యేకత. ధాన్యం గింజలు, పంటల కోత తర్వాత మిగిలిన మోళ్లు, వేళ్లు, పొలాల్లోని మిడతలు, పురుగులు, జెర్రులు, బల్లులు, తొండలు వంటివి వీటి ఆహారం. ఎగిరే పక్షుల్లో రెండవ అతి భారీ పక్షులుగా గుర్తింపు పొందినా.. నివాసానికి అనుకూల వాతావరణం లేక అంతరించిపోతున్నాయి.


