ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉత్తర, దక్షిణ భారత్‌కు ఐఎండీ హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో 44.5°C గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తీర ప్రాంతాల్లో వేడి-తేమతో వాతావరణ మండుతోంది. ఉత్తర భారతంలో రాత్రి వేళల్లో వేడి గాలులు వీస్తున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ సూచించింది.
మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎండలో బయటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. తగినంత నీళ్లు తాగాలని.. తేలికపాటి బట్టలు ధరించాలి. బయట శ్రమతో కూడిన పనులు నివారించాలని వాతావరణ శాఖ సూచించింది. పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని.. ఏప్రిల్-జూన్‌లో తూర్పు, మధ్య, ఉత్తర-పశ్చిమ భారత్‌లో సాధారణం కంటే ఎక్కువ హీట్‌వేవ్ రోజులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఐఎండీ తాజా అంచనాల ప్రకారం.. వాయువ్య, మధ్య, ద్వీపకల్ప భారతదేశంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు (40°C నుండి 44°C) మధ్య నమోదవుతున్నాయి. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో అత్యధికంగా 44.5°C ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 5°C, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న రోజుల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. తీర ప్రాంతం, తూర్పు రాష్ట్రాల్లో ఉక్కపోత (వేడి, తేమ) ఎక్కువగా ఉంటుంది. వాయువ్య భారతదేశంలో ఏప్రిల్ 27 వరకు ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదు. ఆ తర్వాత క్రమంగా తగ్గుతాయి. ఇతర ప్రాంతాల్లో మొదట ఉష్ణోగ్రతలు పెరిగి, ఆపై తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.


