ఈ85 ఫ్యూయెల్‌పై త్వరలో ముసాయిదా నిబంధనలు
ప్రస్తుతం ఇంధనంలో 20% మాత్రమే ఇథనాల్ మిశ్రమం
చమురు సంక్షోభం నేపథ్యంలో కేంద్రం అడుగులు
20కి బదులుగా 21%..
ప్రస్తుత వాహనాల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుతమున్న 20% నుంచి 21%కి పెంచవచ్చని ప్రభు త్వం గత వారం సూచించింది. ఇటీ వలి కాలంలో వస్తున్న ఆధునిక ఇంజన్లు కొంత అదనపు మార్పును తట్టుకునేలా రూపొందాయి. ఇంజన్ హార్డ్‌వేర్‌లో ఎటువంటి ఖరీదైన మార్పులు చేయకుండానే ఈ 21% మిశ్రమాన్ని వాడొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
సాక్షి, స్పెషల్ డెస్క్: ఇప్పటి వరకు మీ వాహనంలో వాడుతున్న పెట్రోల్‌లో ఇథనాల్ 20% మాత్రమే ఉంటోంది. రాబోయే రోజుల్లో ఇది 85% చేరే అవకాశం ఉంది. ముడి చమురు దిగుమతుల్లో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి సారించిన భారత్.. ఈ85 ఇంధనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం అతి త్వరలో విడుదల చేయనుంది. ఇంధన రంగంలో భారత్ స్వయంసమృద్ధి సాధించాలని, సమీప భవిష్యత్తులో దేశం 100% ఇథనాల్ మిశ్రమానికి చేరుకోవాలన్న కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ85 అంటే ఇంధనంలో 85% ఇథనాల్, 15% పెట్రోల్ ఉంటుంది. ఈ85 దేశవ్యాప్తంగా అందుబాటులోకి రావడా నికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు ముప్పు ఏర్పడటంతో స్వదేశీ ఇథనాల్ వాడకాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై పెట్రోలియం, రవాణా, వ్యవసాయ శాఖల మధ్య ఏకాభిప్రాయం ఉంది. వాహన తయారీ సంస్థలు కూడా ఈ మార్పునకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ85 ఇంధనం ప్రాథమిక పరీక్షల్లో ఇంజన్లపై ఆశాజనక ఫలితాలను ఇచ్చిందని సమాచారం. అధిక మొత్తంలో ఇథనాల్‌ను కలపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం దశాబ్దం క్రితమే పురుడుపోసుకుంది. 2016లోనే ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాల కోసం ఈ85 ఇంధన వినియోగాన్ని నోటిఫై చేశారు. దీంతోపాటు ఈ85, స్వచ్ఛమైన ఇథనాల్ (ఈ100) కోసం ఉద్గార ప్రమాణాలను కూడా అప్పుడే ప్రకటించారు.
ప్రత్యేక ఇంధన గ్రేడ్‌గా..
ఈ85 అనేది ప్రస్తుతం ఉన్న ఈ20 పెట్రోల్ కంటే భిన్నమైన, ఒక ప్రత్యేక ఇంధన గ్రేడ్‌గా ప్రవేశపెడతారు. ఇంత అధిక శాతం ఇథనాల్‌తో వాహనం నడవాలంటే ఇంజన్లు ప్రత్యేకంగా తయారవ్వాలి. సాధారణ పెట్రోల్ ఇంజిన్లు, ఇంధన వ్యవస్థలు అంతటి అధిక ఆల్కహాల్ శాతాన్ని తట్టుకునేలా రూపొందలేదు. అయితే 2023లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ20 గ్రేడ్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 27% వరకు పెంచుకోవడానికి అనుమతి ఉంది.
డీజిల్‌లో సైతం..
దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడానికి డీజిల్‌లో ఇథనాల్‌ను కలపాలని భారత్ భావిస్తోంది. కొన్ని పైలట్ ప్రాజెక్టులు ఆశాజనకమైన ఫలితాలను ఇవ్వడంతో ప్రధానమంత్రి కార్యాలయం ఈ ఆలోచనను సమీక్షిస్తోంది. ఇది దేశానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలుసుకోవడానికి త్వరలోనే ఒక సమగ్ర నివేదిక రానుంది.
పెద్ద మొత్తంలో ఆదా..
⇒ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (ఈబీపీ) కార్యక్రమం ద్వారా భారత్ ఏటా సుమారు 4.5 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును ఆదా చేయగలిగింది.
⇒ ఇప్పటివరకు విదేశీ మారక ద్రవ్యం రూపంలో సుమారు రూ.1.65 లక్షల కోట్లు ఆదా అయింది.
⇒ ఇథనాల్ ఉత్పత్తికి చెరకు, మొక్కజొన్న రైతులకు రూ.1.18 లక్షల కోట్లకు పైగా చెల్లించారు.
⇒ భారత్ తన చమురు అవసరాల కోసం 85 శాతానికిపైగా ఇతర దేశాలపై ఆధారపడుతోంది.
ఇథనాల్ రకాలు..
1వ తరం: చెరకు రసం, మొలాసిస్, మొక్కజొన్న, పాడైపోయిన ఆహార ధాన్యాల నుంచి తయారు చేస్తారు.
2వ తరం: వరి గడ్డి, గోధుమ గడ్డి, మొక్కజొన్న పిప్పి వంటి పంట వ్యర్థాల నుంచి ఉత్పత్తి చేస్తారు.
3వ తరం: ఆల్గే (నాచు) వంటి మూలాల నుండి రూపొందిస్తారు.
కొన్ని సవాళ్లు..
⇒ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో శక్తి కొంచెం తక్కువ. దీనివల్ల వాహనం ఇచ్చే మైలేజ్ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంటుంది.
⇒ అధిక మొత్తంలో ఇథనాల్ వాడాలంటే వాహనాల్లో ప్రత్యేకమైన ఫ్లెక్స్–ఫ్యూయల్ ఇంజిన్లు అవసరమవుతాయి.


