భారతదేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ నిర్మాణానికి గ్రామాలే పునాది. అందుకే మహాత్మా గాంధీ ‘భారతదేశ ఆత్మ గ్రామాల్లోనే ఉంది’ అన్నారు. ఆయన కలలుగన్న ‘గ్రామ స్వరాజ్యం’ భావనకు రాజ్యాంగబద్ధమైన రూపం ఇచ్చింది 1993 సంవత్సరంలో అమలులోకి వచ్చిన 73వ రాజ్యాంగ సవరణ. రాజ్యాంగంలోని 9వ భాగం (ఆర్టికల్ 243) ద్వారా మూడంచెల పంచాయతీ వ్యవస్థకు చట్ట బద్ధత లభించింది. ఏప్రిల్ 24న జరుపుకొనే ‘జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం’ ఈ భావనకు గుర్తింపు మాత్రమే కాదు, వ్యవస్థ పనితీరుపై ఆత్మపరిశీలన చేసుకునే అవకాశం కూడా.
దేశంలో సుమారు 6.5 లక్షల గ్రామాలు ఉండగా, 64% జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తోంది. సుమారు 2.6 లక్షల గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ ప్రకారం వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, తాగునీరు వంటి 29 కీలక అంశాలు పంచాయతీల పరిధిలోకి వస్తాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ తెచ్చిన అతిపెద్ద విప్లవం మహిళా నాయకత్వం. 31.5 లక్షల ఎన్నికైన ప్రతినిధులలో సుమారు 46% మహిళలే ఉండటం విశేషం. 2024 జాతీయ పంచాయతీ అవార్డుల్లో 40% పంచాయతీలు మహిళల నేతృత్వంలోనే ఉండటం వారి సామర్థ్యానికి నిదర్శనం.
గ్రామసభలకు హాజరు పరిమితం
అయితే మహిళల ప్రాతినిధ్యం పెరిగినప్పటికీ, క్షేత్రస్థాయిలో ‘సర్పంచ్ పతి’ (మహిళల పేరుతో భర్తలు లేదా కుటుంబ సభ్యులు పెత్తనం చలాయించడం) వంటి సామాజిక రుగ్మతలు కొనసాగుతున్నాయి. స్థానిక స్వపరిపాలన విజయవంతం కావాలంటే విధులు, నిధులు, సిబ్బంది... ఈ మూడు విషయాలలో సమతుల్యత ఉండాలి. కానీ పంచాయితీలు తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ తాజా నివేదికల ప్రకారం, గ్రామపంచాయతీల సొంత ఆదాయం మొత్తం ఆదాయంలో కేవలం 6.31% మాత్రమే. రాష్ట్రాలు పంచాయతీలకు ఎంత వరకు అధికారాలు బదిలీ చేశాయో అంచనా వేయడానికి ‘పంచాయతీ డివల్యూషన్ ఇండెక్స్’ (పీడీఐ) సూచికను రూపొందించారు.
తాజా నివేదిక ప్రకారం, జాతీయ స్థాయిలో డివల్యూషన్ 39.9% నుండి 43.9%కి పెరిగింది. వికేంద్రీకరణలో కర్ణాటక, కేరళ, తమిళ నాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అగ్రస్థానాల్లో నిలిచాయి. సామర్థ్య వృద్ధిలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. ఈ ఇండెక్స్ రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహిస్తోంది. సాంకేతి కత ద్వారా పారదర్శకతను పెంచేందుకు తెచ్చిందే ‘స్వామిత్వ’ పథకం. దీని కింద డ్రోన్ టెక్నాలజీ ద్వారా గ్రామీణ ఆస్తుల సర్వే చేసి, యజమానులకు ఆస్తి కార్డులు ఇస్తున్నారు. ‘మేరీ పంచాయత్’ యాప్ ద్వారా పంచాయతీ ప్రొఫైల్, నిధుల వినియోగం, అభివృద్ధి పనుల వివరాలను ప్రజలు నేరుగా తెలుసుకోవచ్చు.
చదవండి: 'మూసీ నది బాగుపడాలంటే చేయాల్సింది ఇది'
గ్రామస్థులంతా సభ్యులుగా ఉండే గ్రామసభే పంచాయతీ వ్యవస్థకు గుండెకాయ వంటిది. అయితే గ్రామసభలకు ప్రజల హాజరు ఇంకా పరిమితంగానే ఉండటం ఈ వ్యవస్థ ఎదుర్కొంటున్న పెద్ద సవాలు. గ్రామ పంచాయతీలు కేవలం ప్రభుత్వ పథకాల అమలు సంస్థలుగా మిగిలిపోకుండా, నిజమైన ‘స్వయం పాలనా సంస్థలు’గా ఎదగాలంటే పలు కీలక చర్యలు తీసుకోవాలి. ఆస్తి పన్ను తదితర పన్నుల మదింపు విధానాలను సరళీకరించి పంచాయతీల సొంత ఆదాయాన్ని పెంచాలి. చెరువులు, అడవులు తదితర కమ్యూనిటీ వనరులను వాటి పరిధిలోకి తీసుకురావాలి. వికసిత పంచాయతీలు – వికసిత భారత్ లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయాణంలో ప్రజలంతా ఏ విభేదాలు లేకుండా భాగం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకు అవసరమైన చర్యలను చిత్తశుద్ధితో చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.
– ఉదయ్ కుమార్ జి.
సీనియర్ జర్నలిస్ట్
(ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం)


