ట్రెండీ లుక్‌ కోసం.. ఆ ఫర్నీచరే కావాలంట

Trendy Look: People Show Interest On Concrete Furniture - Sakshi

గృహాలంకరణలో శతాబ్దాలుగా కలప అగ్రస్థానంలో ఉంది. స్టీల్, ఇత్తడి దశాబ్దాలుగా తమ వైభవాన్ని చాటుతూనే ఉన్నాయి. మధ్యలో కొంత వరకు ప్లాస్టిక్‌ చొరబడింది. నిజానికి చాలా కాలం ఫర్నీచర్‌ విషయంలో వీటి గురించి తప్ప పెద్దగా ఆలోచనలు సాగలేదు. ఔట్‌డోర్‌కి మాత్రమే పరిమితమైన కాంక్రీట్‌ ఫర్నీచర్‌ వేగంగా ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. 

ఇన్నాళ్లూ కాంక్రీట్‌ను ఇంటి నిర్మాణంలో వాడుతారు, ఔట్‌డోర్‌లో కొంతవరకు బెంచీలు, టేబుళ్లుగా వాడుతారు తప్ప ఇంటీరియర్‌ డిజైనర్‌లో భాగంగా వాడరు అనే అభిప్రాయం ఉంది. ఇప్పుడిక ఈ ఆలోచన మరుగున పడిపోయి కాంక్రీట్‌తో అద్భుతాలను సృష్టిస్తున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు. ల్యాంప్స్, టేబుల్స్, బుక్‌ కేసెస్‌.. ఒకటేమిటి. కాదేదీ కాంక్రీట్‌కు అనర్హం అనిపిస్తున్నారు. 

సిమెంట్‌.. ఇసుక.. రాళ్లు
తగినన్ని పాళ్లలో కలిపిన ఈ కాంక్రీట్‌ పదార్థంతో ఏ డిజైన్‌ అయినా రాబట్టవచ్చు. నిజానికి దీనిని అర్ధం చేసుకుంటే అద్భుతాలు చేయవచ్చు అంటారు ఇంటీరియర్‌ డిజైనర్లు. పైగా మిగతా ఫర్నీచర్‌తో పోల్చితే చవకైనది. లగ్జరీగా కూడా కనిపిస్తుంది. ‘కాంక్రీట్‌ను శిల్పకలతో పోల్చవచ్చు. ఈ పదార్థానికి ఉన్న పరిమితి ఏంటో దాని తయారీదారు చేతుల్లోనే ఉంటుంది’ అంటారు ప్రతీక్‌ మోది. కాంక్రీట్‌ సొల్యూషన్స్‌ డిజైన్‌ సంస్థ ‘సూపర్‌ క్యాస్ట్‌’ యజమాని ప్రతీక్‌. ఇంటి డెకార్‌లో కాంక్రీట్‌ను లెక్కలేనన్ని మార్గాల్లో ఉపయోగించవచ్చు’ అంటారు. 

లివింగ్‌ రూమ్‌
టీవీ చూస్తూ, పేపర్‌ చదువుకుంటూ, టీ–కాఫీ లాంటివి సేవిస్తూ, మాట్లాడుకుంటూ, అతిథలతో కూర్చుంటూ .. కుటుంబంలో అందరూ ఇలా ఎక్కువ సేపు లివింగ్‌ రూమ్‌లోనే ఉండటానికి సమయాన్ని కేటాయిస్తారు. అందుకే, దీనిని ఫ్యామిలీ రూమ్‌ అనవచ్చు. అలాంటి ఈ రూమ్‌ అలంకరణలో ప్రత్యేకత తీసుకుంటారు. సృజనాత్మకత, మీదైన ప్రత్యేకత కనిపించాలంటే సెంటర్‌ టేబుల్‌ను వినూత్నంగా డిజైన్‌ చేయుంచుకోవచ్చు. అందుకు కాంక్రీట్‌ ఫర్నీచర్‌ మేలైన ఎంపిక అవుతుంది. 

ప్రయోగాల కాంక్రీట్‌
తమ ఇంటి కళలో తమకు తామే ఓ కొత్త సృష్టి చేయాలని ఎవరికి వారు అనుకునేవారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. వారి చేతుల్లో కాంక్రీట్‌ కొత్త కొత్త వింతలు పోతోంది అంటారు ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్‌ డిజైనర్లు. కాంక్రీట్‌ టేబుల్స్, ఇతర ఉత్పత్తులు చాలా గట్టిగా, మూలలు పదునుగా ఉంటాయి. ఇవి జాగ్రత్తగా వాడకపోతే గాయలు అయ్యే అవకాశం ఉందనుకునేవారు వీటికి వంపులను, నునుపుదనాన్ని సొగసుగా తీసుకువస్తున్నారు. అలాంటి డిజైన్స్‌ కూడా మార్కెట్‌లో విరివిగా దర్శనమిస్తున్నాయి.

సరదా అభిరుచి
ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేయాలనుకున్నా, అభిరుచిని పెంపొందించుకోవాలన్నా కాంక్రీట్‌ ముడిసరుకుగా ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు మట్టితో బొమ్మలు, వాటికి పెయింట్స్‌ వేసి మురిసిపోయేవారు. ఇప్పుడా అవకాశం కాంక్రీట్‌ ఇస్తుంది. పైగా చేసిన వస్తువు త్వరగా పగలకుండా ఇంట్లో కనువిందు చేస్తుంది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top