ఆతిథ్యం, ఎయిర్‌లైన్స్‌పై వార్‌ ఎఫెక్ట్‌  | West Asia tensions dampen India tourism inflows | Sakshi
Sakshi News home page

ఆతిథ్యం, ఎయిర్‌లైన్స్‌పై వార్‌ ఎఫెక్ట్‌ 

Apr 17 2026 5:48 AM | Updated on Apr 17 2026 7:49 AM

West Asia tensions dampen India tourism inflows

15–20% తగ్గిన పర్యాటకులు 

ఎయిర్‌లైన్స్‌ రంగానికి రూ.18,000 కోట్ల నష్టం 

రెస్టారెంట్‌ పరిశ్రమలోనూ సంక్షోభం 

ప్రమాదంలో 5–7 లక్షల ఉద్యోగాలు

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత భారత పర్యాటక రంగం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఫిబ్రవరి 28 తర్వాత నుంచి చూస్తే 15–20 శాతం మేర విదేశీ పర్యాటకులు తగ్గిపోయారు. దీని ఫలితంగా ఒక్క ఎయిర్‌లైన్స్‌ రంగమే రూ.18,000 కోట్ల వ్యాపారాన్ని నష్టపోతుందన్నది అంచనా. అతిథ్య పరిశ్రమపైనా ప్రభావం ఉంటుందని తాజాగా విడుదలైన ఒక నివేదిక అంచనా వేసింది. విమాన ప్రయాణాలను రద్దు చేసుకోవడం, గగనతలంపై ఆంక్షలతో అంతర్జాతీయ ఎయిర్‌లైన్‌ సర్వీసులు మార్గాలను మార్చుకుని వెళ్లాల్సి వస్తుండడం ఇవన్నీ ఎయిర్‌లైన్స్‌ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయి.

 దీని ఫలితంగా ప్రయాణ సమయం 2–4 గంటలు పెరుగుతోందని, ఇంధన, నిర్వహణ ఖర్చుల భారాన్ని మోయాల్సి వస్తోందని ఈ నివేదిక అంచనా వేసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పర్యాటకులు అప్రమత్తతను అనుసరిస్తున్నారు. తమ పర్యటలను వాయిదా వేసుకోవడం లేదా రద్దు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు సుదూర ప్రాంతాల కంటే థాయ్‌లాండ్, సింగపూర్, వియత్నాం వంటి తక్కువ దూరంలోని ప్రాంతాలకు వెళ్లి రావడానికే మొగ్గు చూపుతున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. 

రెస్టారెంట్లకూ కష్టాలు.. 
రెస్టారెంట్, ఫుడ్‌ సర్వీసెస్‌ (ఆహార విక్రయ సంస్థలు) సంస్థలు సైతం పశ్చిమాసియా యద్ధం తర్వాత కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ముఖ్యంగా వీటి వ్యయాలు 10–15 శాతం మేర పెరిగాయి. దిగుమతి చేసుకుంటున్న ముడి పదార్థాలు, రవాణా, ఇంధన ధరలు పెరిగిపోవడమే ఇందుకు కారణమని నేషనల్‌ రెస్టారెంట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) అంచనా. 

ముఖ్యంగా వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ) సరఫరాలో సమస్యలు రెస్టారెంట్‌ పరిశ్రమపై గణనీయమైన ప్రభావం చూపిస్తున్నట్టు ఎన్‌ఆర్‌ఏఐ ప్రెసిడెంట్‌ సాగర్‌ దర్యాని తెలిపారు. 10 శాతం రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయని, 60–70 శాతం రెస్టారెంట్లు ఇండక్షన్‌ కుకింగ్, ఇతర ప్రత్యామ్నాయాల వైపు మళ్లినట్టు పేర్కొన్నారు. పరిమిత సరఫరా నేపథ్యంలో మెనూ తగ్గించుకుని, తక్కువ సమయం పాటు కార్యకలాపాలు నిర్వహించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు చెప్పారు.  

ఉపాధిపైనా ప్రభావం.. 
రెస్టారెంట్ల రంగంలో రోజువారీ రూ.2,650 కోట్ల కార్యకలాపాలు కొనసాగుతుంటాయని ఈ నివేదిక పేర్కొంది. అంటే నెలవారీ రూ.79,000 కోట్లు. ఈ రంగంలో 85 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఎక్కువ కాలం పాటు ఈ ప్రతికూలతలు కొనసాగితే 5–7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని అంచనా. అంతేకాదు రెస్టారెంట్ల విస్తరణపైనా ప్రభావం పడుతుందని పేర్కొంది.

 కాగా, ఈ ప్రతికూలతలను అధిగమించేందుకు గాను.. మరిన్ని అంతర్జాతీయ మార్గాలకు ఎయిర్‌లైన్స్‌ కార్యకలాపాలను విస్తరించడంతోపాటు, ఎంఎస్‌ఎంఈలకు మరింత సులభంగా రుణాలు అందేలా చూడాలని ఈ నివేదిక సూచించింది.  దేశీ పర్యాటకం మెరుగ్గానే ఉన్నప్పటికీ, అంతర్జాతీయ పర్యాటకం తిరిగి పూర్వపు స్థితికి రావడానికి మరో 6 నుంచి 12 నెలల సమయం పట్టొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement