పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల క్రూడ్ రేట్లు పెరగకుండా రష్యన్ ఆయిల్‌పై ఆంక్షలను అమెరికా నెలరోజుల పాటు సడలించడంతో, ఆ దేశం నుంచి ముడి చమురు దిగుమతులు మళ్లీ జోరందుకున్నాయి. మార్చిలో భారత్ కొనుగోళ్లు మూడు రెట్లు పెరిగి 5.3 బిలియన్ డాలర్లకు చేరాయి.
యూరప్‌కి చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ, క్లీన్ ఎయిర్ (క్రియా) నివేదిక ప్రకారం ఫిబ్రవరిలో రష్యా నుంచి దిగుమతులను తగ్గించుకున్న భారత్, ఆ తర్వాతి నెలలో మళ్లీ గణనీయంగా కొనుగోళ్లు చేసింది. మొత్తం 5.8 బిలియన్ యూరోల విలువ చేసే రష్యన్ హైడ్రోకార్బన్స్‌ని దిగుమతి చేసుకోగా ఇందులో క్రూడాయిల్ వాటా 91 శాతం (సుమారు 5.3 బిలయన్ యూరోలు)గా నమోదైంది.
ఇది 2025 మార్చిలో నమోదైన దానితో పోలిస్తే 72 శాతం అధికం. ఇక రష్యా నుంచి దిగుమతి చేసుకున్న మిగతా వాటిలో బొగ్గు (337 మిలియన్ యూరోలు), ఇతరత్రా ఆయిల్ ఉత్పత్తులు (178.5 మిలియన్ యూరోలు) ఉన్నాయి. మార్చిలో భారత్ క్రూడాయిల్ దిగుమతులు మొత్తం మీద 4 శాతం తగ్గినప్పటికీ రష్యా నుంచి కొనుగోళ్లు మాత్రం రెట్టింపయ్యాయి.
ఫిబ్రవరిలో 1.4 బిలియన్ డాలర్ల మేర ముడిచమురు దిగుమతి అయింది. ఆంక్షల కారణంగా 2025 నవంబర్‌లో రష్యన్ దిగుమతులు నిలిపివేసిన ప్రభుత్వ రంగ మంగళూరు, వైజాగ్ రిఫైనరీలు 2026 మార్చి నుంచి తిరిగి కొనుగోళ్లు మొదలుపెట్టాయి.


