ఎరియర్స్‌ వచ్చాయా.. కొత్త ఫారాలు నింపండి.. | New Tax Rules for Salary Arrears Transitioning from Form 10E to Form 39 | Sakshi
Sakshi News home page

Income Tax: ఎరియర్స్‌ వచ్చాయా.. కొత్త ఫారాలు నింపండి..

Apr 27 2026 11:14 AM | Updated on Apr 27 2026 11:20 AM

New Tax Rules for Salary Arrears Transitioning from Form 10E to Form 39

కొత్త చట్టం, కొత్త రూల్స్, కొత్త ఫారాల వల్ల ఎన్నో మంచి మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు. సాంకేతికత, సులభతరం కోణంలోనే కాకుండా హేతుబద్ధీకరించే విధంగా ఇవి ఉన్నాయి. ఈ మార్పులతో కొత్త ఫారాల వల్ల ఒనగూరే ప్రయోజనాలు.

  •     సులభతరం

  •     అంశాలన్నీ నింపితే సమాచారం సమగ్రంగా ఉంటుంది.

  •     యూజర్‌ ఫ్రెండ్లీగా ఉన్నాయి.  

  •     సాంకేతికంగా అనువుగా ఉండటం వల్ల ప్రాసెసింగ్‌ త్వరగా అవుతుంది.

  •     అటు చట్టం, ఇటు రూల్స్‌లోని అంశాలకి (మార్పులు) అనుగుణంగా, ఎటువంటి తికమక లేకుండా సాఫీగా, సజావుగా సాగుతుంది.  

  •     పాత ఫారాల్లో ఉన్న తప్పొప్పులు, పొరపాట్లు, లోటుపాట్లు లేకుండా తయారు చేశారు.

  •     ఫారం నింపగానే అనుసంధానం కావడం వల్ల అన్నింటిని అన్వయించుకుని, ఇతర సమాచారం మీద ఆధారపడకుండా అధికారులు చకచకా పరుగెడతారు.

పాత చట్టంలో 89 (1), ఫారం 10ఈ 
జీతాల ఎరియర్స్‌ రావడం, వాటిని, సంవత్సరాలవారీగా విడగొట్టి, ఆయా ఆర్థిక సంవత్సరాలకు సర్దుబాటు చేయడాన్ని 89 (1) సెక్షన్లో ప్రస్తావిస్తారు. ఆ అంశాలన్నీ ఫారం 10ఈ లో నింపాలి. అప్పుడు రిలీఫ్‌ లెక్కించాలి.

కొత్త సెక్షన్‌ 157 (1), కొత్త రూల్స్‌ 97, కొత్త ఫారం 39 
కొత్త సెక్షన్‌ 157 (1), దాన్ని అమలుపర్చడానికి ఉద్దేశించినది 97 రూలు. ఈ రెండింటినీ అనుసంధానిస్తూ ఫారం 39 తయారైంది. పాన్‌ లేనిదే ఈ కొత్త ఫారాన్ని నింపలేరు. దాఖలు చేయలేరు.  

కొత్త ఫారంలో ఏమేమి తెలియజేయాలి? 
తొలి భాగంలో వ్యక్తిగత వివరాలతో పాటు ఏ ఆర్థిక సంవత్సరంలో ఎరియర్స్‌ వచ్చాయో తెలియజేయాలి. మలి భాగంలో ముఖ్యమైన విషయం అంతా అంకెలమయంగా ఉంటుంది. డేటా అంతా రాయాలి. ఎరియర్స్‌ మీద ఎంత వచి్చంది రాయాలి. జీతం, గ్రాట్యుటీ, రిట్రెంచ్‌మెంట్‌ పరిహారం, పెన్షన్‌..ఇలా ఏదైనా కావొచ్చు అన్నీ రాయాలి. వీటిని సరిగ్గా నింపితే ఆ తర్వాత కాలమ్‌లో అన్నీ ఆటో పాపులేట్‌ అయిపోతాయి. పన్ను భారమెంత, ఆదాయం ఎంత, ఎరియర్స్‌ ఎంత, పన్ను ఎంత, ఉపశమనం (రిలీఫ్‌) ఎంత .. అన్నీ తెలుస్తాయి. చివరగా రిలీఫ్‌ ఎంతో లెక్కించి వస్తుంది.

ఫారం 10ఈని అంతా చేతితో నింపాలి. మనమే అన్ని లెక్కలు చేయాలి. రాయాలి. బోలెడంత పని. యజమాని చేయరు. ఉద్యోగికి శ్రమతో కూడుకున్న పని. ఇప్పుడు ఇదంతా చిటికెలో అయిపోతుంది. ఈ సమాచారం అంతా ఆటోమేటిక్‌గా మీరు వేసే ఆదాయ పన్ను ఫారంలలో, అంటే ఐటీఆర్‌లలోకి వెళ్లిపోతుంది. కరెక్టుగా ఉంటే సమాచారం చాలా త్వరగా బదిలీ అవుతుంది.

ఏయే డాక్యుమెంట్లు అవసరం.. 
మీ పాన్‌ కార్డు, మీ టీడీఎస్‌ సర్టిఫికెట్లు, మీ ఏఐఎస్‌ ఫారం, వచి్చన ఎరియర్స్‌ వివరాల గురించి తెలియజేసే పత్రం, ఫారం 130, ఫారం 168, గత సంవత్సరాల రిటర్నులు, పన్ను లెక్కింపుల ఎరియర్స్‌ వివరాలు కాగితాల రూపంలో కావాలి.

అంతా ఆన్‌లైన్‌లోనే .. 
ఇది డిజిటల్‌ ఫారం. ఇది వరకు లాగా ఆఫ్‌లైన్‌లో వేయకూడదు. పోర్టల్‌లో దాఖలు చేయాలి. ఇందుకోసం మెనూకి వెళ్లి, ఫారం 39ని క్లిక్‌ చేయండి. బేసిక్‌ డేటా, ఎంపిక చేసిన కాలమ్‌లను సరిగ్గా నింపండి. రివ్యూ చేసుకోవచ్చు. రెండుసార్లు చెక్‌ చేసుకోవచ్చు. వెరిఫై చేయండి. ఫైల్‌ చేయండి. అక్నాలెడ్జ్‌మెంట్‌ వస్తుంది.  

ఇక తరువాత.. 
రిటర్ను వేయడమే! రిలీఫ్‌ మీకు వస్తుంది. ఏ అనుమతి కోసమూ ఆగనక్కర్లేదు.  అయితే, రిటర్ను వేసేందుకు మరీ చివరి తేదీ వరకు ఆగకుండా, రెండు–మూడు నెలల ముందే ప్రాసెస్‌ మొదలుపెట్టండి.

మీకు తెలిసిన పాత విశేషాలే అయినా.. మరోసారి..

  •     ఉద్యోగులకు వర్తిస్తుంది.

  •     గత సంవత్సరం, ఈ సంవత్సరం ఎరియర్స్‌ ఒకేసారి ఏకమొత్తంగా రావొచ్చు.

  •     గత సంవత్సరంలో మీ ఆదాయం తక్కువ శ్లాబులో పన్నుకి గురి అయి ఉండాలి

  •     ఈ ఎరియర్స్‌ని ఆయా సంవత్సరాలకు సర్దుబాటు చేయడం వల్ల ఏం అవుతుందంటే, ఈ సంవత్సరం 30 శాతం బ్రాకెట్లో పడే ఆదాయం తగ్గి, గత సంవత్సరం 10 శాతానికి, 20 శాతానికి తగ్గొచ్చు.

  •     అంటే గత సంవత్సరం చేతికి వచ్చి ఉంటే తక్కువ రేటులోనే పన్ను భారం ఉండేది.

  •     ఇప్పటి 30 శాతానికి బదులుగా పన్ను భారం రేటు తగ్గి ఉండేది. ఆ ఉపశమనాన్నే రిలీఫ్‌ 
    అంటారు.     

ఆల్‌ ది బెస్ట్‌.

Advertisement
 
Advertisement
Advertisement