యూజ్డ్‌ కార్లే ముద్దు | India used car market is projected to double from USD 35 billion in FY26 | Sakshi
Sakshi News home page

యూజ్డ్‌ కార్లే ముద్దు

May 1 2026 3:28 AM | Updated on May 1 2026 7:50 AM

India used car market is projected to double from USD 35 billion in FY26

రూ.6.58 లక్షల కోట్లకు మార్కెట్‌

2031 నాటికి దాదాపు రెట్టింపు 

రెడ్‌సీర్‌ సంస్థ అంచనాలు

ముంబై: యూజ్డ్‌ కార్ల (అప్పటికే మరొకరు వినియోగించిన) మార్కెట్‌ భారీగా విస్తరిస్తోంది. 2031 నాటికి 70 బిలియన్‌ డాలర్ల విలువకు (రూ.6.58 లక్షల కోట్లు) యూజ్డ్‌ కార్ల మార్కెట్‌ చేరుతుందని కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్‌ తెలిపింది. ప్రస్తుతం ఈ మార్కెట్‌ పరిమాణం 35 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 

కార్లను వేగంగా మార్చడం, ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ, ఫీచర్లతో కొత్త కార్లు మార్కెట్‌ ప్రవేశం చేస్తుండడం, భద్రతా ప్రమాణాల్లో మార్పులు, వినియోగదారుల ప్రాధాన్యతలు, కొనుగోలు చేసే స్థాయిలో ధరలు (అందుబాటు) ఉండడం తదితర అంశాలతో అంతర్జాతీయంగా యూజ్డ్‌ కార్లకు భారత్‌ అత్యంత ఆకర్షణీయ మార్కెట్‌గా మారినట్టు రెడ్‌సీర్‌ నివేదిక పేర్కొంది. 

అంతర్జాతీయంగా యూజ్డ్‌ కార్లలో ప్రస్తుతం భారత్‌ ఐదో అతిపెద్ద మార్కెట్‌గా ఉంటే, ఈ దశాబ్దం చివరికి అమెరికా, చైనా తర్వాత మూడో స్థానానికి చేరుకోనుంది. 2030–31 సంవత్సరంలో రిటైల్‌ యూజ్డ్‌ కార్ల విక్రయాలు కోటి యూనిట్లుగా ఉంటాయని ఈ నివేదిక అంచనా. సగటున ఒక్కో కారు విక్రయ ధర రూ.6.5–6.9 లక్షలుగా ఉంటుందని రెడ్‌సీర్‌ పేర్కొంది.

4–5 ఏళ్లకే మార్చేస్తున్న వైనం.. 
దేశంలో పునర్‌వినియోగ కార్ల మార్కెట్‌ వృద్ధికి ఎన్నో అంశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. 2020–21 నాటికి ఒక కారును 7–8 ఏళ్లు వినియోగించిన తర్వాతే కొత్త కారుకు అప్‌గ్రేడ్‌ అయ్యే వారు. 2030–31 నాటికి కార్లను మార్చే కాల వ్యవధి 4–5 ఏళ్లకు తగ్గిపోనుందని రెడ్‌సీర్‌ అంచనా. ముఖ్యంగా మెట్రోలు, టైర్‌–1 నగరాలు ఈ డిమాండ్‌ను నడిపిస్తున్నాయి. అసంఘటిత రంగం నుంచి.. నిర్మాణాత్మక, విశ్వసనీయ మార్కెట్‌గా ఇది మార్పు చెందుతోందని రెడ్‌సీస్‌ స్ట్రాటజీ కన్సల్టెంట్స్‌ అసోసియేట్‌ పార్ట్‌నర్‌ కుశాల్‌ భట్నాగర్‌ పేర్కొన్నారు. 

ఒకవైపు పెరుగుతున్న ఆదాయ స్థాయిలు, మరోవైపు యూజ్డ్‌ కార్లకు రుణ సదుపాయం లభిస్తుండడం డిమాండ్, సరఫరాను పెంచుతున్నాయని చెప్పారు. 2031 మార్చి నాటికి భారత్‌లో 28 కోట్ల గృహాలకు యూజ్డ్‌ కార్ల కొనుగోలు సామర్థ్యం ఉంటుందని ఈ నివేదిక అంచనా వేసింది. యూజ్డ్‌ కార్ల రుణ మార్కెట్‌ సైతం 30–40%కి పెరుగుతుందని పేర్కొంది. ప్రస్తుతం యూజ్డ్‌ కార్ల అమ్మకాల్లో 80% అసంఘటితంగానే  జరుగుతున్నాయంటూ.. ఈ మార్కెట్‌ వృద్ధికి భారీ అవకాశాలున్నాయని  తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement