భారత్‌ వృద్ధికి... క్రూడ్‌ కోత! | India GDP growth may slow by 0. 8 Percentage if oil hits 130 in 2026 | Sakshi
Sakshi News home page

భారత్‌ వృద్ధికి... క్రూడ్‌ కోత!

Apr 15 2026 1:11 AM | Updated on Apr 15 2026 1:11 AM

India GDP growth may slow by 0. 8 Percentage if oil hits 130 in 2026

బ్యారెల్‌ 130 డాలర్లకు చేరితే వృద్ధిపై ప్రభావం 

0.8 శాతం తగ్గొచ్చు: ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌

ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరింత పెరిగి బ్యారెల్‌కు 130 డాలర్లకు చేరితే భారత్‌ ఆర్థిక వృద్ధి రేటుపై 80 బేసిస్‌ పాయింట్ల (0.8 శాతం) మేర ప్రభావం పడొచ్చని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. బలమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, పటిష్టమైన ఆర్థిక రంగంతో చమురు ధరల పెరుగుదలను భారత్‌ తట్టుకోగలదని పేర్కొంది. ‘‘చమురు ధరలు పెరిగితే ప్రభుత్వ ద్రవ్య లోటు లక్ష్యాలకు కొంత ఆటంకం కలగొచ్చు. కానీ భారత్‌ ‘సావరిన్‌ రేటింగ్‌’ పై తక్షణమే ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు’’అని ఎస్‌అండ్‌పీ స్పష్టం చేసింది. ఒకవేళ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గి, చమురు సరఫరా సాధారణ స్థితికి వస్తే.. భారత్‌ తిరిగి పుంజుకుంటుందని నివేదిక పేర్కొంది. 

నివేదికలోని ఇతర అంశాలు..  
చమురు ధరల పెరుగుదల వల్ల గృహ వినియోగం, కార్పొరేట్‌ లాభాలు, బ్యాంకింగ్‌ రంగంపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల జీడీపీ వృద్ధి రేటు మందగించే అవకాశం ఉంది. 
కంపెనీల ఎబిట్డా 2027 ఆర్థిక సంవత్సరంలో 15–25 శాతం తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా కెమికల్స్, రిఫైనింగ్‌ మరియు విమానయాన రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 
బ్యాంకింగ్‌ రంగంలో మొండి బకాయిలు (ఎన్‌పీఏలు) 3.5 శాతానికి పెరగొచ్చు. అయినప్పటికీ, భారతీయ బ్యాంకుల వద్ద తగినంత మూలధనం ఉండటం ఊరటనిచ్చే అంశం. 

చమురు ధర ప్రతి 10 డాలర్ల పెరుగుదలతో దేశ కరెంట్‌ అకౌంట్‌ లోటు జీడీపీలో 0.4% పెరగవచ్చు. దీనివల్ల రూపాయి విలువపైనా ఒత్తిడి పడుతుంది. 
భారతీయ కంపెనీలు గత కొన్నేళ్లుగా అప్పులను తగ్గించుకుంటూ రావడంతో వాటి బ్యాలెన్స్‌ షీట్లు బలంగా ఉన్నాయి. బ్యాంకుల వద్ద మెరుగైన మూలధనంతోపాటు తక్కువ స్థాయిలో ఎన్‌పీఏలు సానుకూలాంశాలు.

Advertisement
 
Advertisement
Advertisement